పూలమాలలతో సరిపెట్టారు!
కర్నూలు(అర్బన్): కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పూలమాలలతో సరిపెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా జయంతి కార్యక్రమలను సంక్షేమ వసతి గృహాల్లో నిర్వహించాలని ఈ నెల 4న రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. దీంతో ప్రతి ఏడాది ఎంతో ధూంధాంగా నిర్వహించే అంబేడ్కర్ జయంతి ఈ ఏడాది కళ తప్పింది. ప్రతి ఏడాది ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్‌రామ్, 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ఉత్సవాలను సంక్షేమ వసతి గృహాల్లోనే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల దళిత, ప్రజా సంఘాల నేతలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో నిర్వహణ ఇలా..
● వారం ముందు నుంచే సన్నాహక సమావేశాలు నిర్వహించి సభల నిర్వహణకు సంబంధించి ఆయా సంఘాల నేతల సలహాలు, సూచనలు తీసుకునేవారు.
● కరపత్రాలు, పోస్టర్లు, షామియానాలు, భోజనాలతో జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం కనిపించేది.
● సభా ప్రాంగణం రంగు రంగుల తోరణాలు, లైటింగ్‌తో అందంగా తీర్చిదిద్దేవారు.
● సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఒకానొక సందర్భంలో మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగేది.
● జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు జయంతి సభల్లో పాల్గొనేవారు.
ఈ విడత ఇలా..
● రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పీ రంజిత్‌బాషా తదితరులు స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
● జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా మండల కేంద్రమైన వెల్దుర్తి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలుర వసతి గృహంలో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
● బహిరంగ సభలు నిర్వహిస్తే ప్రజా సంఘాల నేతలు ప్రభుత్వాల చర్యలను ఎండగడతారనే భయంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.
● రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలకు దండలు వేయడం సరిపెట్టిన ప్రభుత్వ తీరును దళిత, ప్రజా సంఘాలతో పాటు ప్రజలు కూడా తప్పుపడుతున్నారు.
నామమాత్రంగా అంబేడ్కర్ జయంతి
హాస్టళ్లలో నిర్వహించాలని
కూటమి ప్రభుత్వం మెమో
పూలమాలలతో సరిపెట్టిన
అధికార యంత్రాంగం
నివాళులర్పించిన మంత్రి టీజీ భరత్,
ఎంపీ నాగరాజు, జిల్లా కలెక్టర్
రంజిత్‌బాషా
కూటమి ప్రభుత్వ తీరుపై దళిత,
ప్రజా సంఘాల ఆగ్రహం


