యాక్సిడెంట్ చేసి చాకచక్యంగా పారిపోతున్నాం.. నిర్మానుష్
కర్నూలు: కర్నూలు నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. దీంతో నిర్మానుష్య ప్రాంతాలకు కొదువ లేదు. మద్యం, గంజాయి తాగేవారి కార్యకలాపాలకు ఆయా ప్రాంతాలు నిలయాలుగా మారుతున్నాయి. యువత రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఎంత నిఘా పెట్టినా పూర్తిస్థాయిలో నియంత్రణ సాధ్యపడని పరిస్థితి. దీంతో క్లౌడ్ పెట్రోలింగ్ పేరుతో డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపారు. లైవ్‌లో చూస్తూ పోలీసులు అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే సమీప పోలీసు బృందాలను అప్రమత్తం చేసి పనిపడుతున్నారు.
ట్రాఫిక్ పరిరక్షణకు...
నేర నియంత్రణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ నిఘాను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉండగా, ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు వినియోగించేందుకు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన 6 డ్రోన్ కెమెరాలు ఉన్నాయి. ఈ డ్రోన్‌లు కిలోమీటర్ ఎత్తు, నగర పరిధిలో 2 కి.మీల చుట్టూ నిఘా ఉంచుతాయి. ఖాళీ ప్రదేశంలో 3 కి.మీల దూరం కూడా వెళ్తాయి. రాత్రివేళల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కెమెరా ద్వారా మనుషులను, వాహనాలను లెక్కిస్తుంది. మరికొన్ని కెమెరాలు తెప్పించేందుకు పోలీసు శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
వినియోగంపై పలువురికి శిక్షణ
పోలీసింగ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి పోలీసు శాఖ పెద్దపీట వేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. జిల్లా వ్యాప్తంగా డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తూ అక్రమాలకు చెక్ పెడుతున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ వీటి వినియోగంపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వినియోగంపై ఇప్పటికే ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఇద్దరు చొప్పున శిక్షణ తీసుకున్నారు. ప్రతి పోలీస్ కానిస్టేబుల్‌ను డ్రోన్ పైలెట్‌గా తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో ఇందుకోసం ఆరుగురు శిక్షకులు ఉన్నారు. విడతల వారీగా స్టేషన్ల నుంచి కానిస్టేబుళ్లను జిల్లా కేంద్రానికి రప్పించి శిక్షణ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. స్టేషన్ పరిధిలో ఎక్కడైనా, ఏదైనా అసాంఘిక కార్యక్రమం చోటు చేసుకున్నట్లు సమాచారం అందితే డ్రోన్లను రంగంలోకి దింపుతున్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా పండుగలు, దేవరలు, తిరునాలలు, భారీ వేడుకల సందర్భంగా ఇకపై డ్రోన్లతో నిఘా ఉంచనున్నారు.
డ్రోన్‌తో నిశిత గస్తీ
సమస్యాత్మక కాలనీలు, విద్యాసంస్థలు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గస్తీ అమలు చేస్తున్నాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకు క్లౌడ్ పెట్రోలింగ్‌కు శ్రీకారం చుట్టాం. అనుమానం వచ్చిన ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించి నిందితులను పట్టుకుంటాం. వేగంతో దూసుకెళ్లే వాహనదారులపై డ్రోన్లతో నిరంతరం నిఘా ఉంటుంది. – విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ
అసాంఘిక కార్యకలాపాలపై నిఘా
డ్రోన్ల రాకతో నిర్మానుష్య, అనుమానిత ప్రాంతాలు, సమస్యాత్మక కాలనీలపై నిఘా పెరిగింది. ఆయా కాలనీల పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేసి చిత్రాలు, వీడియోలు తీస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు డ్రోన్ సేవలు దోహదపడుతున్నాయి. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణపై కర్నూలులో డ్రోన్ సేవలకు శ్రీకారం చుట్టారు. స్టేషన్ నుంచే లైవ్‌లో చూస్తూ సుదూర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లను గుర్తించి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. నగరంలోని ఏ మూలన ట్రాఫిక్ సమస్య తలెత్తినా ఎప్పటికప్పుడు గుర్తించేందుకు డ్రోన్ సేవలు ఉపయోగపడుతున్నాయి.
యాక్సిడెంట్ చేసి చాకచక్యంగా పారిపోతున్నాం.. నిర్మానుష్


