జగన్మాత.. దీవించమ్మా!
● శ్రీశైలంలో శాస్త్రోక్తంగా కుంభోత్సవం
● గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలతో భ్రమరాంబదేవికి సాత్వికబలి
శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం జగన్మాత అయిన శ్రీశైల భ్రమరాంబాదేవికి సంప్రదాయబద్ధంగా మంగళవారం వార్షిక కుంభోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాలలో ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు అమ్మవారికి సాత్వికబలిని సమర్పిస్తారు. ఈ సందర్భంగా శ్రీభ్రమరాంబాదేవి ఆలయాన్ని నిమ్మకాయల దండలతో ప్రత్యేకంగా అలంకరించారు. కుంభోత్సవంలో భాగంగా ముందుగా ఉదయం అమ్మవారి ఆలయంలో రజకునితో ప్రత్యేక రంగవల్లిని వేయించారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పం పఠించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా జరిపించారు. శాంతి ప్రక్రియగా అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను కూడా అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి ఏకాంతంగా పూజాదికాలను జరిపిన తరువాత సాత్వికబలికి సిద్ధం చేసిన రెండు వేలకుపైగా కొబ్బరికాయలు, ఐదు వేల గుమ్మడికాయలు, 60వేలకుపైగా నిమ్మకాయలు, వండిన అన్నం (కుంభం)కు కూడా పూజాదికాలు జరిపించారు. స్థానిక వ్యాపార సంఘం వారు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, వండిన అన్నం అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు. అనంతరం హరిహరరాయగోపుర ద్వారం వద్దగల మహాషాసురమర్ధిని అమ్మవారికి (కొటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలు జరిపి, సాత్వికబలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు. అమ్మవారి ఆలయంలో రజకునితో ప్రత్యేక ముగ్గు వేయించిన శ్రీచక్రం వద్ద విశేషపూజలు నిర్వహించారు. సాయంకాలం శ్రీమల్లికార్జున స్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం జరిపించారు. అలాగే సాయంకాలం అమ్మవారికి ఎదురుగా ఉండేవిధంగా సింహమండపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా సమర్పించారు.
అమ్మవారికి కుంభహారతి
సంప్రదాయాన్ని అనుసరించి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించారు. దీంతో ఉత్సవంలో ప్రధానఘట్టం ప్రారంభమైంది. అనంతరం రెండో విడత సాత్వికబలిగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పించారు.
అమ్మవారి నిజరూపదర్శనం
శ్రీభ్రమరాంబాదేవికి విశేషపూజాదికాలు నిర్వహించిన అనంతరం అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కలిగించారు. చివరిగా అమ్మవారికి పునఃపూజలను చేసి పలు రకాల వంటకాలతో అమ్మవారికి మహానివేదన చేశారు. ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాళమ్మకు కూడా ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించారు.
జగన్మాత.. దీవించమ్మా!


