
అకాల వర్షం.. అపార నష్టం
హొళగుంద/చిప్పగిరి: ఈదురుగాలులతో కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లి గ్రామంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. కల్లాల్లో నిల్వ ఉంచిన మిరప తడిసిపోయింది. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) కింద వందలాది ఎకరాల్లో వరి సాగు చేశారు. పైరు గింజ దశలో ఉన్న సమయంలో వడగండ్ల వాన పడింది. దీంతో పైరులోని 90 శాతం మేర గింజలన్నీ నేలరాలాయి. అలాగే పైరు నేలకొరిగింది. ఇప్పటికే కోత జరిగి కల్లాల్లో ధాన్యం బస్తాలు ఉంచగా తడిసిపోయాయి. అదేవిధంగా మిరప, మామిడి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి పూత నేల రాలి దెబ్బ తినగా.. కల్లంలో ఉంచిన ఎండు మిరప నీటిలో నానిపోయింది. ఈదురుగాలులకు పెద్దహరివాణం రోడ్డులో, గజ్జహళ్ల్లి బీసీ కాలనీలో చెట్టు కొమ్మ లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఉరుములు, మెరుపులతో ప్రజలు బయటకు రాలేకపోయారు. చేతికందే దశలో వరిపంట దెబ్బతిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చిప్పగిరి మండలంలోని నేమకల్లు, రామదుర్గం, బెల్డోణ, దౌల్తాపురం నంచర్ల తదితర గ్రామాల్లో పెద్దఎత్తున మెరుపులు, ఉరుములతో వర్షం కురిసింది. నేమకల్లు, కుందనగుర్తి గ్రామాల్లో చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ అంతరాయంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పగలు ఎండలు.. సాయంత్రానికి వానలు
కర్నూలు అగ్రికల్చర్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్ర పెరిగింది. వేడి గాలులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. పగలు మహానందిలో 41.5, పాణ్యంలో 41.5, గోస్పాడులో 41.6, దొర్నిపాడులో 41.7, గడివేములలో 41.1, కర్నూలులో 40.4, కోడుమూరులో 40.1 ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం హొళగుంద, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, కొత్తపల్లి, కోవెలకుంట్ల తదితర మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఆస్పరిలో పిడుగు పడిన ఘటనలో ఒక ఎద్దు మృతిచెందింది.

అకాల వర్షం.. అపార నష్టం