రాజ్యాంగానికి మోదీ తూట్లు
డోన్ టౌన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని పలువురు వక్తలు విమర్శించారు. నూతన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆదివారం డోన్ పట్టణంలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని గుత్తి రోడ్డులో ఉన్న ఖబరస్తాన్ ఈద్గా నుంచి బేతంచెర్ల సర్కిల్, రైల్వే గేట్లు, పాత బస్టాండ్, స్టేట్ బ్యాంక్, కొత్త బస్టాండ్ తదితర ప్రాంతాల మీదుగా ఈ ర్యాలీ సాగింది. జాతీయ జెండాలు, నల్ల జెండాలు చేతబట్టి వక్ఫ్ సంరక్షణ, రాజ్యాంగ పరి రక్షణ అంటూ ముస్లింలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు ర్యాలీకి మద్దతు పలికారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు ముస్లిం మత పెద్దలు, సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అంతా అన్యాయమన్నారు. ఈ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం లేదని, మరింత నష్టం కల్గించే విధంగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేసి పెట్టుబడి దారులకు కట్టబెట్టేందుకే కేంద్రం ఈ చట్టాని రూపొందించిందన్నారు. ఏపీ, బిహార్ సీఎంలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. నూతన వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేయక పోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
నూతన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు
పోరాటం
నిరసన ర్యాలీలో ముస్లింలు
రాజ్యాంగానికి మోదీ తూట్లు


