భగవాన్ సత్యసాయి బాబా సేవలు శాశ్వతం
కర్నూలు(సెంట్రల్): పుట్టపర్తి భగవాస్ సత్యసాయిబాబా సేవలు శాశ్వతమని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతిని వేడుకలను ఆదివారం నిర్వహించారు. ముందుగా బాబా చిత్రపటానికి ఎంపీ నాగరాజు, జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు భగవాన్ సత్యసాయిబాబా ట్రస్టు చేయూతను ఇవ్వాలన్నారు. జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జఫ్రుల్లా, మలేరియా అధికారి నూకరాజు, ట్రస్టు ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, కన్వీనర్ అశోక్‌కుమార్, సభ్యులు లక్ష్మీ, సరోజ పాల్గొన్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 8977716661 నంబరుకు ఫోన్‌చేసి సమస్యల గురించి చెప్పవచ్చని పేర్కొన్నారు.
ఏటీఎం మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కర్నూలు (టౌన్): ‘ఏటీఎంలో డబ్బులు జమ చేయండి.. ఈ రంబర్‌కు ఫోన్ పే, యునీఐ ద్వారా పంపండి.. కమిషన్ ఇస్తాం’ అంటూ వచ్చే మేసేజ్‌లు, ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది మనీ లాండరింగ్, సైబర్ నేరాలకు సంబంధించిన అక్రమ చర్య అని, పాల్గొనే వ్యక్తి కూడా నేరానికి సహకరించినట్లు పరిగణిస్తారని తెలిపారు. అనుమానాస్పద లావదేవీలు గమనిస్తే వెంటనే 1930 సైబర్ క్రెమ్ హెల్ప్‌లైన్‌కు లేదంటే సమీప పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
తూకపు యంత్రాలతో పత్తి కొనుగోళ్లలో మోసం
కర్నూలు(సెంట్రల్): రీవెరిఫికేషన్/స్టాంపింగ్ గడువు ముగిసిన తూకపు యంత్రాలతో పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు/ట్రేడర్లు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి కొనుగోలు తుకాల్లో మోసాలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులతో గూడూరు, కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, ఆదోని, కోసిగి మండలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. కొందరు వ్యాపారులు రీ–వెరిఫికేషన్/స్టాంపింగ్ గడువు దాటిన తూకపు యంత్రాలను వినియోగిస్తున్నట్లు గుర్తించి లీగల్ మెట్రాలజీ చట్టం 2009లోని సెక్షన్ 8/25, 30 ప్రకారం 12 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సంబంధిత వ్యాపారులకు రూ.90 వేలు జరిమానా కూడా విధించినట్లు వివరించారు. తూకపు యంత్రాలతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం వెరిఫికేషన్ చేసిన యంత్రపు సర్టిఫికెట్లను వ్యాపార సమూదాయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.
కర్నూలు(అర్బన్): శ్రీశైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం విషయంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు తీర్మానం గిరిజనులను విడదీసిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్‌నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డు తీర్మానం చెంచులకు న్యాయం చేస్తూనే, గిరిజన లంబాడీలకు తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. ఆదివారం స్థానిక ఎల్‌హెచ్‌పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు నెలలో ఒక సారి శివ లింగాన్ని స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు. అయితే కేవలం చెంచులకు మాత్రమే స్పర్శ దర్శనాన్ని కల్పిస్తూ లంబాడీలను విస్మరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బోర్డు కమిటీ సభ్యులు మరో సారి సమావేశం నిర్వహించి నెలలో ఒక సారి గిరిజన లంబాడీలు కూడా స్పర్శ దర్శనం చేసుకునే విధంగా తీర్మాణం చేయాలని కోరారు.
భగవాన్ సత్యసాయి బాబా సేవలు శాశ్వతం


