శ్రీమాన్‌రెడ్డి గల్లంతైన చోట సముద్ర జలాల్లో వెతుకుతున్న సహాయక సిబ్బంది
మహబూబాబాద్: ఇరాన్ నుంచి కువైట్ వెళ్తున్న షిప్‌లోనుంచి ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైన మండలంలోని బయ్యక్కపేట గ్రామానికి చెందిన సర్పంచ్ గుర్రం రమ, సమ్మిరెడ్డి దంపతుల కుమారుడు శ్రీమాన్‌రెడ్డి ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో కుటుంబంతోపాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీమాన్.. ఈనెల 21వ తేదీన ఇరాన్ నుంచి కువైట్‌కు ట్రాన్స్‌ఫోర్ట్ షిప్‌లో వెళ్తున్నానని తల్లిదండ్రులు ఫోన్ చేసి తెలిపాడు.
కువైట్ నుంచి వచ్చిన తరువాత మళ్లీ ఫోన్ చేస్తానని శ్రీమాన్ తమతో చివరిసారి మాట్లాడాడని తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు. ఈ నెల 22న కువైట్ వెళ్తున్న క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రమాదవశాత్తు షిప్‌లో నుంచి శ్రీమాన్‌రెడ్డి సముద్రంలో గల్లంతయ్యారని జైపూర్ హెడ్‌క్వార్టర్స్‌గా నడిచే రుద్రాక్ష కన్స్‌ల్టెంట్ కంపెనీ యాజమాన్యం తెలిపిందన్నారు. గల్లంతైన సమయంలో షిప్‌లోని ఏడుగురిలో నలుగురు ప్రాణాలతో బయట పడగా వారికి చికిత్స అందిస్తున్నారని, కెప్టెన్‌తో పాటు మరొకరి మృతదేహం లభ్యమైనట్లు సంస్థ ప్రతినిధులు సమాచారం అందించారని తెలిపారు.
కానీ తమ కుమారుడి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకూ తెలియలేదని కన్నీరుమున్నీరవుతున్నారు. దీనిపై మంగళవారం మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి తమ కుమారుడి ఆచూకీ కోసం ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. దీనిపై మంత్రి సీతక్క.. ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులకు పూర్తి వివరాల కోసం సమాచారం అందించినట్లు తెలిపారన్నారు.
కాగా, బుధవారం కలెక్టర్.. తమ కుమారుడి మృతదేహం లభ్యమైనట్లు తమకు సమాచారం అందిందని శ్రీమాన్‌రెడ్డి తల్లిదండ్రులకు తెలిపారు. దీనిపై జైపూర్ రుద్రాక్ష సంస్థ ప్రతినిధులను సంప్రదించగా తమకు మాత్రం ఎలాంటి మృతదేహం లభించినట్లు, మరేఇతర సమాచారం లేదని తల్లిదండ్రులకు వివరించారు. దీంతో శ్రీమాన్‌రెడ్డి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమ కుమారుడి ఆచూకీ అందించడానికి చర్యలు తీసుకోవాలని వారు వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment