నారక్కపేటలో విషాదం | - | Sakshi
Sakshi News home page

నారక్కపేటలో విషాదం

Published Mon, Jul 8 2024 1:16 AM | Last Updated on Mon, Jul 8 2024 11:00 AM

నారక్

నారక్కపేటలో విషాదం

చికిత్స పొందుతూ ఎస్సై శ్రీను కన్నుమూత

న్యాయం చేయాలని కుటుంబీకులు, గ్రామస్తుల ధర్నా

భారీగా మోహరించిన పోలీసులు

నల్లబెల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను(31) కన్నుమూశారు. సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో ఆయన స్వగ్రామం వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. అశ్వరావుపే ట ఎస్సై శ్రీనుపై కొంతకాలంగా సీఐ జితేందర్‌ రెడ్డితో పాటు సిబ్బంది మానసిక వేధింపులకు పాల్ప డుతున్నారు.

 ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. పైగా సీఐ జితేందర్‌ రెడ్డితో పాటు సిబ్బంది వేధింపులు మరింత పెరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను గత నెల 30న మహబుబాబాద్‌ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సికింద్రా బాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసిన వైద్యులు.. శ్రీను మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా తమ స్వగ్రామం నారక్కపేటకు తరలించారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబీకులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేశారు. న్యాయం చేస్తామని పోలీసు అధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు. అనంతరం కుటుంబ సభ్యులు శ్రీను అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఐదు నెలల క్రితం అశ్వరావుపేటకు బదిలీ ..
2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై శ్రీను.. భద్రాది కొత్తగూడెంలో జిల్లా కరకగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని అన్నపురెడ్డిపల్లి, కొత్తగూడెం త్రీ టౌన్‌, బోడు, చుంచుపల్లి, డీసీఆర్బీ భద్రాది కొత్తగూడెం, మణుగూరు పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఐదు నెలల క్రితం అశ్వరావుపేట కు బదిలీ అయ్యాడు. అయితే ఇక్కడి పోలీసుస్టేషన్‌లో అధికారుల వేధింపులకు బలయ్యాడని కుటుంబ సభ్యులు రోదించారు. కాగా, శ్రీను మృతి వార్త వినగానే అతడి మేనత్త రాజమ్మ గుండెపోటుతో మృతి చెందింది.

పలువురి సంతాపం
శ్రీను మృతి పట్ల భద్రాది కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌ రాజు, డీసీపీ రవీందర్‌, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నర్సంపేట ఏసీపీ కిరణ్‌ కుమార్‌, భద్రాది కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌కే అబ్దుల్‌ రెహమాన్‌తో పాటు ఇతర అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న, పీఏసీఎస్‌ చైర్మన్‌ చెట్టుపల్లి మురళీధర్‌, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మండల అధ్యక్షులు బానోత్‌ సారంగపాణి, చిట్యాల తిరుపతి రెడ్డి పరామర్శించారు.

భారీగా మోహరించిన పోలీసులు..
ఎస్సై శ్రీను ఆత్మహత్య బాధ్యులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబీకులు, గ్రామస్తులు, దళిత సంఘాల నాయకులు నారక్కపేటలో ఆందోళన చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. నర్సంపేట ఏసీపీ కిరణ్‌ కుమార్‌, సీఐ రాజగోపాల్‌ పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ పోలీస్‌ స్టేషన్ల నుంచి సిబ్బంది భారీగా చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే బందోబస్తులో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
నారక్కపేటలో విషాదం1
1/1

నారక్కపేటలో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement