
భార్య మరణం తట్టుకోలేక.. భర్త మృతి
గీసుకొండ: కలకాలం తనకు తోడుగా ఉంటానని పెళ్లిలో వేద మంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన భార్య అర్ధాంతరంగా తనువు చాలించింది. దీంతో ఆ బాధ తట్టుకోలేక భర్త మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుప్పరి లలిత(49), కుమారస్వామి(56) దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఈ క్రమంలో లలిత ఇటీవల బాత్ రూంలో కాలు జారి పడి తీవ్రంగా గాయపడింది.
ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. తన భార్య మృతి తట్టులోని కుమారస్వామి మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. ఈ దంపతుల మృతి మనుగొండలో విషాదం నింపింది. కాంగ్రెస్ నాయకుడు, సామాజిక సేవకుడు అల్లం బాలకిశోర్‌రెడ్డి రూ. 10 వేల ఆర్థిక సాయం పంపించగా కాంగ్రెస్ నాయకులు అల్లం మర్రెడ్డి, కొమ్ము శ్రీకాంత్, కూనమల్ల అనిల్, ఎంబాడి పరమేశ్వర్ తదితరులు మృతుల కుటుంబ సభ్యులకు అందించారు.
వదిన మృతదేహాన్ని చూసి ఆడబిడ్డ..
దుగ్గొండి: వదిన మృతదేహాన్ని చూసి గుండెపోటుతో ఆడబిడ్డ మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గుడ్డేలుగులపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తొర్రూరు అమృతమ్మ (72) సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ మేరకు ఆత్మకూరు మండలం మహ్మద్‌గౌస్‌పల్లి గ్రామానికి చెందిన ఆమె ఆడబిడ్డ కూసం సరోజన (62) వదిన అంత్యక్రియల కోసం మంగళవారం గుడ్డేలుగులపల్లికి వచ్చింది.
ఉదయం 11 గంటలకు సరోజన.. వదిన మృతదేహాన్ని చూసి ఐదు నిమిషాలపాటు బోరున విలపించింది. ఆ వెంటనే గుండెనొప్పితో ఆమె కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది. కొన్ని గంటల వ్యవధిలోనే వదిన, ఆడబిడ్డ ఇద్దరు మృతి చెందడంతో గుడ్డేలుగులపల్లి, మహ్మద్‌గౌస్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment