భవిష్యత్‌లో మానవ రహిత వ్యవసాయం
హన్మకొండ : భవిష్యత్‌లో మానవ రహిత వ్యవసాయ సాగు పద్ధతులు రావొచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అగ్రి హబ్‌ను నాబార్డు సీజీఎం ఉదయ్‌భాస్కర్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జానయ్య మాట్లాడుతూ.. ఇప్పటికే డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు చల్లడం వంటివి చేస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో రోబోల సాయం పొందే అవకాశాలున్నాయని తెలిపారు. రోబోలు వస్తే మానవ ప్రమేయం లేకుండా వ్యవసాయ పనులు చేసుకోవచ్చన్నారు. వ్యవసాయం ఎప్పుడూ సంక్షోభంలో చిక్కుకోలేదని, చిక్కుకుంది రైతులు మాత్రమే అని ఉద్ఘాటించారు. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంటే కాలగర్భంలో కలిసి పోవాల్సిందేనని వెల్లడించారు. విద్య, వైద్యం ప్రైవేట్ రంగంలోకి రావడంతో రైతులకు ఖర్చులు పెరిగాయని, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మినహా రైతుకు ఇతర ఆదాయం ఉండదని చెప్పారు. చైనాలో వ్యవసాయ పారిశ్రామికీకరణ, గ్రామీణ పారిశ్రామికీకరణ జరిగి దేశం అభివృద్ధి చెందిందని వివరించారు. దేశంలో గ్రామీణ ప్రాంత నూతన ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు అగ్రి హబ్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ క్రమంలోనే వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నాబార్డు సాయంతో అగ్రి హబ్ ఏర్పాటు చేశామని అన్నారు. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు అందుబాటులో ఉండేలా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అగ్రిహబ్ ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ రంగానికి పనికి వచ్చే పనిముట్లు తీసుకు రావాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఈ దిశగా ఔత్సాహికులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. దేశంలో ఏడు ఇంక్యుబేషన్ సెంటర్లు ఉంటే తెలంగాణలో రెండు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన సంచాలకుడు డాక్టర్ బలరాం, అగ్రి హబ్ ఎండీ డాక్టర్ ఆర్.కల్పనా శాస్త్రి, సీఈఓ విజయ్, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వెంకటరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారులు అనురాధ, రవీందర్ సింగ్, శాస్త్రవేత్తలు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
● ప్రకృతి వనరులను
కాపాడుకోవాలి
నూతన ఆవిష్కర్తలకు అగ్రి హబ్ దోహదం
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య
Comments
Please login to add a commentAdd a comment