ఆర్టీసీ ఉద్యోగులకు ‘పవర్’
శారీరకంగా, మానసికంగా సన్నద్ధం చేయడమే లక్ష్యంగా శిక్షణ..
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను శారీరకంగా, మానసికంగా సన్నద్ధులను చేసి శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి ‘పవర్’ పేరుతో శిక్షణ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే ఆదాయం పెంపుతోపాటు సంస్థ పరిరక్షణకు ‘ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం’, ‘ఏప్రిల్–ఆగస్ట్ చాలెంజ్ ఫర్ ట్రైనింగ్’ వంటి శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడంతో మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులు, సూపర్‌వైజర్లకు అవసరమైన నైపుణ్యాలు, మెళకువలు నేర్పి వారిని శారీరకంగా, మానసికంగా శక్తివంతులను చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘పవర్’ (పీక్ ఫార్మామెన్స్ త్రూ ఓనర్‌షిప్ విత్ ఎంపతి రిజాల్వ్) పేరుతో ఉద్యోగులకు శిక్షణ ఇస్తోంది. సంస్థలో ఉద్యోగుల భాగస్వామ్యం, ప్రయాణికులతో సహానుభూతితో అత్యున్నత ఫలితాల సాధనకు ధృఢసంకల్పంతో ముందుకు సాగడం ఈ కార్యక్రమం లక్ష్యం. సంస్థకు ప్రయాణికులే ప్రధాన వనరు. ఈ క్రమంలో వారిపై ఉద్యోగులు మర్యాదగా ప్రవర్తించడం, వారిని ఆర్టీసీ వైపు ఆకర్షించేలా చేయడం, ప్రశాంత మనస్సుతో విధులకు హాజరుకావడానికి తీసుకోవాల్సిన విశ్రాంతి, శారీరకంగా దృఢంగా ఉండడానికి చేపట్టాల్సిన క్రియలు, ఇతర అంశాలు ఈ శిక్షణలో బోధించి ఉద్యోగులను సన్నద్ధం చేస్తారు.
ఉద్యోగుల ఆరోగ్యం ముఖ్యం..
ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ డిపోలో ఒక సేఫ్టీ వార్డెన్, ఇద్దరు హెల్త్ వలంటీర్లను నియమించారు. వీరు ఆ డిపోలోని ప్రతీ ఉద్యోగి ఆరోగ్యాన్ని గమనిస్తుంటారు. ఏదేని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే వారికి అవసరమైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటారు. ఔషధాలు సమయానుకూలంగా వాడేలా వారిని జాగృతం చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి మందులు సరిగా వేసుకునేలా సూచనలు చేస్తారు. తద్వారా ఆ ఉద్యోగి ఆరోగ్యంగా ఉండేలా చూస్తారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి నిర్దేశం చేస్తారు. అదే విధంగా డ్రైవర్లు ప్రమాదాలు చేయకుండా ఉండేందుకు, సురక్షిత డ్రైవింగ్, ఇంధన పొదుపుపై శిక్షణ ఇచ్చేందుకు ప్రతి డిపోలో సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించారు. ఆదా యం, కేఎంపీఎల్ అధ్యయనం చేసేందుకు ప్రతీ డిపోకు 20 మంది మెంటార్స్‌ను నియమించారు. వీరు నిర్దేశించిన లక్ష్యం వైపు నడిచేలా జాగ్రత్తలు వివరిస్తారు. టార్గెట్ మేరకు ఆదాయం వచ్చిందా..? ఇంధన పొదుపు జరుగుతుందా వంటి అంశాలను పరిశీలిస్తూ వారికి కావాల్సిన సూచనలు ఇస్తారు.
ఈ నెల
18వ తేదీన ప్రారంభం
ఉద్యోగులను కార్యోణ్ముకులను చేసేందుకు..
ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగులను కార్యోణ్ముకులను చేసేందుకు సంస్థ ‘పవర్’ అనే కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తోంది. ఇందులో ప్రతీ ఉద్యోగికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాం. ప్రతీ రోజు విధులకు ప్రశాంతంగా హాజరయ్యేలా తీర్చిదిద్దుతాం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి తగు జాగ్రత్తలు వివరిస్తాం. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన సమగ్ర శిక్షణ ఈ ‘పవర్’ కార్యక్రమం ద్వారా ఉద్యోగి పొందుతారు. తద్వారా శక్తివంతులుగా తయారవుతారు.
–డి. విజయభాను, వరంగల్ ఆర్‌ఎం
సిబ్బంది ఆరోగ్యంపై సంస్థ ప్రత్యేక శ్రద్ధ
పర్యవేక్షణకు సేఫ్టీ వార్డెన్,
హెల్త్ వలంటీర్ల నియామకం
లక్ష్య సాధన వైపు ప్రోత్సహించేందుకు
మెంటార్స్
వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో శిక్షణ ప్రారంభం
‘పవర్’ శిక్షణ కార్యక్రమాలు వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో ఈ నెల 18వ తేదీన ప్రారంభమయ్యాయి. డిపోలోని ఉద్యోగులను గ్రూపులుగా ఏర్పాటు చేసి పది రోజుల్లో ఉద్యోగులందరికీ శిక్షణ పూర్తి చేస్తారు. ఈ మేరకు ఇప్పటికే ట్రైనర్లకు హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో డిపో మేనేజర్లు ఫ్యాకల్టీగా వ్యవహరిస్తారు. ఓనర్‌షిప్, దృఢ సంకల్పం, ఆటలు, పాటలు, ఇతర కార్యకలాపాలు, రోడ్డు భద్రత, ప్రయాణికుల పట్ల మర్యాద, వస్త్రధారణ(యూనిఫాం), కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆరోగ్యంపై శిక్షణ ఇస్తారు. దేశంలోని ప్రజారవాణా సంస్థల్లో లో తెలంగాణ ఆర్టీసీ సంస్థ బెంచ్‌మార్క్‌గా ఉండేలా చూసుకుంటూ నిరంతర అభ్యాసం, శిక్షణ ఇస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో పాటు అద్దె బస్సుల డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో పాల్గొనే ఉద్యోగులకు స్పెషల్ ఆఫ్ సెలవు ఇస్తారు. శిక్షణ సమయంలో మధ్యాహ్న భోజనంతో పాటు, రెండుసార్లు టీ, స్నాక్స్ అందిస్తారు. ప్రతి రోజూ ఉద్యోగుల హాజరు వివరాలను ప్రధాన కార్యాలయానికి పంపుతారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ‘పవర్’
Comments
Please login to add a commentAdd a comment