బస్టాండ్‌లో ఒంటరి మహిళలే లక్ష్యంగా..
వరంగల్ క్రైం : రద్దీ సమయాల్లో బస్టాండ్‌లో ఒంటరి మహిళలే లక్ష్యంగా బంగారు ఆభరణాలు చోరీలకు పా ల్పడుతున్న దంపతులను అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి తెలిపారు. వీరి నుంచి సుమారు రూ. 7.50 లక్షల విలువైన 80.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన బొంత జ్యోతి, కిషన్ దంపతులు రోజు వారి కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే కూలీ ద్వారా వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకు సరిపోకపోవడంతోపాటు కొద్దికాలంగా ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో పరిచయస్తుల వద్ద అప్పు చేశారు. తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా బస్టాండ్‌లో రద్దీ సమయాల్లో ఒంటరి మహిళా ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. మహిళా ప్రయాణికులు బస్సు ఎక్కే సమయంలో నిందితులు బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారవుతున్నారు. ఇదే రీతిలో ఈ నెలలో హనుమకొండ బస్టాండ్‌లో మూడు చోరీలకు పా ల్పడ్డారు. ఈ చోరీలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న హనుమకొండ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు టీం ఏర్పాటు చేసి నిందితులను గుర్తించారు. చోరీ సొత్తును హనుమకొండలోని ఏదేని బంగారు దుకాణంలో విక్రయించేందుకు బుధవారం ఉదయం చౌరస్తాకు రావడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఈ దంపతులపై అనుమానం కలిగింది. దీంతో వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించడంతో అరెస్ట్ చేసినట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.
చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్
● రూ. 7.50 లక్షల విలువైన 80.5 గ్రాముల
బంగారు ఆభరణాలు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment