ఇసుకపై ఫోకస్..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఇసుక దందాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పాలసీ తీసుకొచ్చి ఇందిరమ్మ ఇళ్లతోపాటు, సామాన్యులకు అందుబాటు ధరకు ఇసుక సరఫరా చేయాలనే ఆలోచన చేసింది. ఈమేరకు రాష్ట్ర అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టి ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు. అయితే ఇంతకాలం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగిన ఇసుక దందా ఒక్కసారిగా ఆగిపోవడంతో అక్రమార్కులు సతమతమవుతున్నారు.
చెక్‌పోస్టులు..
నూతన ఇసుక పాలసీ అమల్లోకి వచ్చేవరకు ఏర్లు, వాగుల నుంచి తట్టెడు ఇసుక కూడా బయటకు రావొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఈనెల 12న ఇసుక అక్రమ రవాణా కట్టడి చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. కాగా, ఆ మరుసాటి రోజు నుంచి ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ జిల్లాలోని ఆకేరువాగు, మున్నేరు, పాలేరు వాగు పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధానంగా నెల్లికుదురు, నర్సింహులపేట, చిన్నగూడూరు, డోర్నకల్, మరిపెడ, గూడూరు, గార్ల, బయ్యారం, దంతాలపల్లి, పెద్దవంగర పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. ఐదు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, అక్కడ పోలీసులకు ప్రత్యేక డ్యూటీలు వేశారు. రాత్రింబవళ్లు నిఘా పెంచారు.
అక్రమార్కుల ఉక్కిరిబిక్కిరి..
దశాబ్దాలుగా కొంతమంది ఇసుక అక్రమ రవా ణాతో కోట్లకు పడగలెత్తారు. ఈక్రమంలో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు మాముళ్లు తీసుకొని వారికి సహకరించారు. అలాగే పెద్ద నాయకుల నుంచి చోటామోటా నాయకుల వరకు ఇసుక మామూళ్లే ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు.. జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగడంతో ఎవరూ నోరు మెదపని పరిస్థితి నెలకొంది. దీంతో ఇసుక మాఫియాదారులతోపాటు నెలవారీ మామూళ్లు తీసుకునే అధికారులు, పలువురు నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాలసీ ఎప్పుడు వస్తుందో.. అందులో ఏం ఉంటుందో అనే ఆందోళన కూడా వారిలో మొదలైంది.
అక్రమ రవాణాను సహించేది లేదు
జిల్లాలోని వాగుల నుంచి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే సహించేదిలేదు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని చోట్ల చెక్‌పోస్టులు పెట్టాం. పలు ట్రాక్టర్లను సీజ్ చేశాం. పలువురిపై కేసులు నమోదు చేశారు. అక్రమ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తాం.
– సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ
రవాణాపై పోలీసుల నిఘా
ఉన్నతాధికారుల ఆదేశాలతో కట్టుదిట్టం
వాగుల పరీవాహకంలో చెక్ పోస్టులు
అక్రమ రవాణాదారులపై కేసులు
అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఇసుక అక్రమ రవాణా చేయవద్దని పోలీసులు హెచ్చరించినా.. వినకుండా అదే తంతుగా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాక్టర్ల ఓనర్లు, డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించారు. 71మందిని బైండోవర్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. అదేవిధంగా గత తొమ్మిది రోజుల్లో ఎనిమిది కేసులు నమోదు చేశారు. ఎనిమిది ట్రాక్టర్లు సీజ్ చేశారు. 11మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇసుకపై ఫోకస్..
Comments
Please login to add a commentAdd a comment