మంచంలోనే సజీవదహనం..
కురవి: భార్య చనిపోయిందనే కారణంతో కొంతకాలంగా మనస్తాపం చెందుతున్న ఓ వ్యక్తి.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మంచంలోనే సజీవదహనమయ్యాడు. ఈ ఘటన కురవిలో జరిగింది. ఎస్సై గండ్రాతి సతీశ్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని 747కాలనీకి చెందిన తరాల యాదగిరి(46) భార్య విజయ కొన్నేళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లో మంచంలో పడుకున్నాడు. తల్లి నాగమ్మ కొడుకు అన్నం తినకపోవడంతో జొన్న గటక తాగించేందుకు ప్రయత్నించగా వద్దని అలాగే పడుకుని ఉన్నాడు. దీంతో తల్లి పనినిమిత్తం బయటకు వెళ్లింది. అనంతరం ఎవరూ లేని సమయంలో యాదగిరి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచంలోనే సజీవదహనమయ్యాడు. ఇంటి నుంచి పొగలు వస్తుండగా కాలనీ వాసులు చూసి తలుపును తీసి చూడడంతో మంచంలోనే సజీవదహనమై కనిపించాడు. దీంతో వారు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వివిధ పనులకు వెళ్లిన మృతుడి తల్లి, చెల్లె, అన్న, తమ్ముడు వచ్చి యాదగిరి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. కొడుకు అఖిల్‌కు సమాచారం అందించడంతో తండ్రి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా రోదించాడు. ఈ ఘటనపై కుమారుడు అఖిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సతీశ్ వివరించారు. కాగా, మృతుడికి కొడుకు అఖిల్, కుమార్తె దివ్య ఉన్నారు.
భార్య చనిపోయిందనే మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య
‘గటక’ ఎవరికి పోయాలి కొడుకా
అంటూ గుండెలవిసేలా రోదించిన తల్లి
కురవి మండల కేంద్రంలో విషాదం
గటక ఎవరికి పెట్టాలి బిడ్డా..
చనిపోవడానికి ముందు పడుకుని ఉన్న కొడుకు ఆకలితో ఉన్నాడని భావించిన తల్లి నాగమ్మ జొన్న గటక తీసుకుని వచ్చి తాగమని బతిమిలాడింది. అయితే యాదగిరి తనకు ఆకలి కావడం లేదని వద్దనడంతో తల్లి పనినిమిత్తం బయటకు వెళ్లగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు చనిపోయిన విషయం తెలియగానే గటక కలిపిన గిన్నెతో అక్కడికి వచ్చి ఈ గటక ఎవరికి పెట్టాలి కొడుకా అంటూ తల్లి గుండెలవిసేలా రోదించింది. కొడుకు మృతదేహం మీద పడి బోరున విలపించింది.
మంచంలోనే సజీవదహనం..
Comments
Please login to add a commentAdd a comment