రాజకీయ పార్టీల అంశంగా భూపాలపల్లి ఘటన
పక్కా వ్యూహంతోనే మర్డర్.. భార్య సరళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
భూపాలపల్లి పోలీసుల అదుపులో ఇద్దరు..? మరో ముగ్గురి కోసం గాలింపు
నేడు మీడియా ముందుకు నిందితులు..? హత్యకు కారణాలపై క్లారిటీ
దోషులు ఎంతటి వారైనా వదలం.. అన్ని కోణాల్లో దర్యాప్తు : డీఎస్పీ సంపత్ రావు
సాక్షిప్రతినిధి, వరంగల్/భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: మాజీ కౌన్సిలర్ భర్త, సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి (49) హత్య కేసు క్లైమాక్స్‌కు చేరింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుడి భార్య సరళ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసిన భూపాలపల్లి పోలీసులు మూడు ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడి విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను గురువారం ఉదయమే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రాథమిక విచారణలో హత్యకు గల కారణాలపై స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. మరో ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకోగలమన్న ధీమాను పోలీసులు వ్యక్తం చేయగా.. శుక్రవారం నిందితులను మీడియా ముందు హాజరుపర్చి వాస్తవాలు వెల్లడించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
నాగవెళ్లి సరళ ఫిర్యాదులో ఏముంది..?
భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట రాజలింగమూర్తి కుటుంబానికి భూమి ఉందని, ఆ భూమికి సంబంధించి రేణుకుంట్ల కొమురయ్య, రేణుకుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో తన భర్తకు గొడవ జరుగుతోందని, బెదిరింపులతో తమ భూమిని కాజేసే ప్రయత్నం చేయగా సివిల్ కోర్టును ఆశయ్రించారని రాజలింగమూర్తి భార్య సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చాలా రోజులుగా ఈ కేసు నడుస్తున్నా.. త్వరలోనే తీర్పు రానుందని గమనించిన వారు తమ భూమిని ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో తన భర్త రాజలింగమూర్తిని చంపాలని పథకం వేశారని ఆరోపించింది. ఈ మేరకు రేణుకుంట్ల సంజీవ్, పింగిలి శమంత్ అలియాస్ బబ్లూ, మోరె కుమార్, కొత్తూరి కుమార్ అనే నలుగురు వ్యక్తులు బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పట్టణంలోని టీబీజీకేఎస్ ఆఫీసు దగ్గరలో రాజలింగమూర్తి వెళ్తుండగా, రెండు వాహనాల మీద వచ్చి ఇనుపరాడ్లతో తలమీద కొట్టి, కడుపు భాగంలో కత్తితో పొడిచి కిరాతకంగా తన భర్త రాజలింగమూర్తిని చంపారని సరళ ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు హత్యకు గురయ్యారని తమకు తెలిసినవాళ్లు ఇచ్చిన సమాచారంతో భూపాలపల్లిలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పకి వెళ్లేసరికి అప్పటికే తన భర్త చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. తన భర్తను హత్యచేసిన వారిపై, ఈ హత్యకు వెనుక ఉండి వ్యూహరచన చేసి ప్రోత్సహించిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సరళ ఫిర్యాదులో పోలీసులను కోరారు.
గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు..
జిల్లా కేంద్రంలో అటవీ, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై మృతుడు రాజలింగమూర్తి కోర్టుల్లో ప్రైవేట్ కేసులు వేసేవాడు. ఆ భూములను ఆయా శాఖలకు అప్పగించే వరకు పోరాడేది. గతంలో భూపాలపల్లిలో ఓపెన్‌కాస్ట్ ఏర్పాటుపై గ్రీన్ ట్రిబ్యునల్‌ను సైతం ఆశ్రయించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, రాష్ట్రస్థాయి అధికారులు, కాంట్రాక్టర్‌పై జిల్లా కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. సామాజిక కార్యకర్తగా పని చేస్తున్న తనకు కొందరి నుంచి ముప్పు ఉందని, గన్ లైసెన్స్ కావాలని ఆరు నెలల క్రితం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం. కలెక్టర్ ఆ లేఖను జిల్లా ఎస్పీకి పంపగా, పోలీసు అధికారులు విచారణ జరిపారు. రాజలింగమూర్తిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నందున గన్ లైసెన్స్ ఇవ్వలేమని వెల్లడించినట్లు సమాచారం.
బీఆర్‌ఎస్ నేతలపై ఆరోపణ.. రంగలోకి ఎస్పీ
తన భర్త రాజలింగమూర్తి హత్య వెనుక బీఆర్‌ఎస్ నాయకుల కుట్ర ఉందని ఆరోపిస్తూ మృతుడి భార్య సరళ, బంధువులు బుధవారం రాత్రి 2 గంటల వరకు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. సహకరించిన బీఆర్‌ఎస్ నేతల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన అనంతరం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తమకు హామీ ఇస్తేనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంటామని సరళ పట్టుబట్టింది. దీంతో ఎస్పీ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు రాగా మృతుడి కుటుంబ సభ్యులు వెళ్లి మాట్లాడారు. అనంతరం మృతదేహాన్ని తీసుకుని దహన సంస్కారాలు నిర్వహించారు.
రాజకీయ పార్టీలకు అంశంగా రాజలింగమూర్తి హత్య..
భూపాలపల్లి ఘటనలో రాజలింగమూర్తి హత్య రాజ కీయ పార్టీలకు ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికగా మారింది. ఈ హత్యపై పూర్తి వివరాలు కోసం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం ఇంటెలిజె న్స్, స్పెషల్‌బ్రాంచ్‌ల ద్వారా ఆరా తీసింది. ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు భూపాలపల్లి ప్రాంతంలో చర్చనీయాంశం కాగా.. మరోవైపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హత్యపై స్పందించి తగిన విచారణను కోరామన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి స్పందిస్తూ రాజలింగమూర్తి హత్యతో తనకు గానీ, బీఆర్‌ఎస్ పార్టీకి గాని ఎలాంటి సంబంధమూ లేదని ఖండించారు.
ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్.. పోలీసుల అదుపులో ఇద్దరు..
రాజలింగమూర్తి హత్య కేసులో ఐదుగురిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఏ–1గా రేణుకుంట్ల సంజీవ్, ఏ–2గా పింగిలి శ్రీమాంత్(శామంత్) (బబ్లూ), ఏ–3గా మోరె కుమార్, ఏ–4 గా కొత్తూరి కుమార్, ఏ–5గా రేణుకుంట్ల కొమురయ్యను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. హత్యకేసులో పాల్గొన్న వారిపై తమకు అందిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు క్రైంనంబర్ 117/2025 ద్వారా బీఎన్‌ఎస్ చట్టంలోని 191(20; 191(3), 61(2),103(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించినప్పటికీ స్థానిక భూ వివాదం కారణంగానే హత్యకు గురయ్యాడన్న చర్చ జరుగుతోంది. భూపాలపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట గల సర్వే నంబర్ 319లో మొత్తం 2.25 ఎకరాల భూమి ఉంది. అందులో 1.25 ఎకరాల భూమికి సంబంధించి రాజలింగమూర్తికి మరో కొంతమందికి వివాదం నెలకొన్న విషయం తెలిసింది.
నిందితులెవరైనా వదలం.. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు
హత్యకు దారి తీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు చెప్పారు. నిందితులకు రాజలింగమూర్తితో భూ తగాదాలున్నట్లు పేర్కొంటూ, ఇతర కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ మీడియాకు చెప్పారు. హత్య వెనుక ఎవరున్నప్పటికీ వదిలిపెట్టబోమని, అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని స్పష్టం చేశారు. కాగా, రాజలింగమూర్తి హత్య కేసులో తాము ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment