వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ట్రైసీటిలో వరుస సంఘటనలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా వరంగల్ పోలీస్ బాస్ అర్ధరాత్రి వేళ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పోలీసుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నా.. కొందరు అధికారుల్లో పేరుకుపోయిన నిద్రమత్తు మాత్రం వదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిఘా వ్యవస్థ, ముందస్తు సమాచారం సేకరించడంలో, సంఘటన జరిగి 24 గంటల గడుస్తున్నా.. హత్యాయత్నాలకు తెగబడిన వారిని పట్టుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మారని పోలీసుల తీరు..
వరుసగా దొంగతనాలు.. దోపిడీలు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ట్రైసిటీతోపాటు చుట్టుపక్కల ఉన్న చాలామంది ఇన్‌స్పెక్టర్లు ఏసీ గది దాటి బయటకు రావడం లేదనే విమర్శలున్నాయి. వరంగల్ సబ్ డివిజన్‌లోని ఓ స్టేషన్, హనుమకొండ సబ్ డివిజన్‌లో ఓ పోలీస్ స్టేషన్ సాయంత్రం అయితే చాలు జాతరను తలపిస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నట్లు పోలీస్‌శాఖలో జోరుగా ప్రచారం ఉంది. పంచాయితీలకే పోలీసులు పరిమితం కావడంతో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పోలీస్ స్టేషన్ పరిధి, ఏసీపీ, డీసీపీ, సీపీ పరిధిలో ప్రతినెలా జరుగుతున్న నేర సమీక్షలో అధికారులు ఏం అడుగుతున్నారు. కింది స్థాయి అధికారులు ఏం సమాధానం చెబుతున్నారు.? ఎవరికి అంతుపట్టని రహస్యం. ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావుడి చేసి చేతులు దులుపుకొని యథావిధిగా వారి పంచాయితీలకే ప్రాధాన్యం ఇస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదనే? విమర్శలున్నాయి.
నగరంలో హత్యలు.. హత్యాయత్నాలు
గురువారం ఒక్కరోజే మూడు ఘటనలు
బెంబేలెత్తుతున్న నగరవాసులు
Comments
Please login to add a commentAdd a comment