● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
● ప్రజావాణిలో 84 వినతులు
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గమనించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతీఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కాగా ప్రజావాణిలో 84 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులచే ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్, అదనపు కలెక్టర్లు సందర్శించారు. జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీసీఓ వెంకటేశ్వర్లు, డీపీఓ హరిప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఈఈ బీమ్లానాయక్, డీవీహెచ్‌ఓ డాక్టర్ కిరణ్‌కుమార్, డీడబ్ల్యూఓ ధనమ్మ, సివిల్ సప్లయీస్ మేనేజర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ మంజూరు చేయాలి
నా కుమారుడు 8 సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యాడు. చిన్నతనంలోనే మెదడుకు సంబంధించిన వ్యాధితో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. మానసికంగా కూడా దివ్యాంగుడే, సదరం క్యాంపులో సర్టిఫికెట్ తీసుకుని దరఖాస్తు చేసినప్పటికీ.. నేటికీ దివ్యాంగ పింఛన్ రావడం లేదు. వెంటనే మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశా.
– పూజ, దివ్యాంగుడు కీర్తన్‌జాయి తల్లి,
ఎడ్జర్ల, మరిపెడ మండలం


