ఎట్టకేలకు నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు నీటి విడుదల

Mar 28 2025 1:37 AM | Updated on Mar 28 2025 1:39 AM

హసన్‌పర్తి/ధర్మసాగర్‌: దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో భాగంగా దేవన్నపేట వద్ద నిర్మించిన పంపుహౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన మూడు మోటార్లలో ఒక మోటారును ఎట్టకేలకు గురువారం సాయంత్రం మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. 600 క్యూసెక్కుల నీటిని ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి వదిలారు.

అరగంటపాటు వెయిటింగ్‌..

వారం రోజుల క్రితం ధర్మసాగర్‌ చెరువులోకి నీటిని విడుదల చేయడానికి వచ్చిన మంత్రులు మోటార్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఆన్‌ కాకపోవడంతో తిరిగి వెళ్లారు. రెండు రోజుల క్రితం ట్రయల్‌ రన్‌ చేస్తున్న క్రమంలో గేట్‌వాల్వ్‌లు పడిపోయాయి. ప్రత్యేక నిపుణులతో వాటికి మరమ్మతులు చేయించారు. రెండోసారి గురువారం సాయంత్రం మోటార్లు ఆన్‌ చేయడానికి వచ్చినా... మళ్లీ సాంకేతిక సమస్య కారణంగా అరగంట పాటు వెయిట్‌ చేశారు. టెక్నీషియన్లు సమస్య పరిష్కరించిన తర్వాత మంత్రులు లాంఛనంగా మోటారు ఆన్‌ చేశారు.

పూజలు.. సన్మానాలు

మొదట దేవన్నపేటకు చేరుకున్న మంత్రులకు కలెక్టర్‌ ప్రావీణ్య, నాయకులు పూలబొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. వారు తొలుత శిలాఫలకాన్ని సందర్శించారు. అనంతరం పంపుహౌస్‌ వద్దకు చేరుకోగా, వారికి ఇంజనీర్లు నీటిపంపింగ్‌ విధానాన్ని కంప్యూటర్‌లో చూపించారు. నీరు ఎక్కడినుంచి ఎలా వెళ్తుందో వివరించారు. అనంతరం రిబ్బన్‌ కట్‌ చేసి మూడో దశ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అక్కడినుంచి ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకున్నారు. అప్పటికే నీరు రిజర్వాయర్‌లోకి వస్తుండగా పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు చేశారు. నీటిలోకి సారె వదిలారు. ఈ సందర్భంగా మంత్రులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాలువాలు కప్పి సన్మానించారు. అక్కడే మంత్రులు రెండు నిమిషాలు మాట్లాడి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కేఆర్‌ నాగరాజు, యశస్వినిరెడ్డి, మేయర్‌ గుండు సుధారాణి, కుడా చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్‌ ప్రావీణ్య, నగర కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాం నర్సింహారెడ్డి, ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌, సీఈ అశోక్‌కుమార్‌, ఎస్‌ ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సీతారాంనాయక్‌, డీఈఈ రాజు, ఏఈ శ్రీనివాస్‌ పాల్గొన్నారు..

దేవాదుల మూడో దశ మోటారు ఆన్‌ చేసిన మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి

ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి

600 క్యూసెక్కులు

దేవన్నపేట పంపుహౌస్‌తో

5,22,522 ఎకరాలకు సాగు నీరు

వరంగల్‌, కాజీపేట, హనుమకొండతో పాటు జనగామకు తాగునీరు

రెండు భాగాలుగా నీటి పంపిణీ : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దేవాదుల పంపుహౌస్‌ నుంచి వచ్చే నీటిని రెండు భాగాలుగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ కేంద్రంగా ప్రారంభించిన దేవన్నపేట పంపుహౌస్‌తో 5,22,522 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 17,545 ఎకరాలకు ఉత్తర భాగం ప్రధాన కాల్వ ద్వారా, అదేవిధంగా దక్షిణభాగం కాల్వ గుండా స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 1,58,948 ఎకరాలతోపాటు ధర్మసాగర్‌ తర్వాత బొమ్మకూర్‌, తపాసుపల్లి, గండిరామారం, అశ్వారావుపల్లి పరిధిలోని 3,46,029 ఎకరాలకు నీరు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో వరంగల్‌, హనుమకొండ, కాజీపేట మూడునగరాలతోపాటు జనగామ పట్టణానికి తాగునీరు అందించేందుకు దోహదపడుతుందన్నారు.

ఎట్టకేలకు నీటి విడుదల1
1/3

ఎట్టకేలకు నీటి విడుదల

ఎట్టకేలకు నీటి విడుదల2
2/3

ఎట్టకేలకు నీటి విడుదల

ఎట్టకేలకు నీటి విడుదల3
3/3

ఎట్టకేలకు నీటి విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement