డోర్నకల్: మండలంలోని తొడేళ్లగూడెం గ్రామ సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కొలువైన గుట్టపై గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకుని గ్రామస్తులు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకునేందుకు గుట్టపైకి వెళ్లారు. గుట్టపై రెండుచోట్ల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు వారు చెబుతున్నారు. స్వామివారు కొలువైన గుట్టకు ఎంతో చరిత్ర ఉందని, గుట్టపై గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరపడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మా ఊరికి బస్సు వేయండి..
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఆదివారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించినట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ తెలిపారు. మహబూబా బాద్ నుంచి నర్సింహులపేటకు బస్సు సౌకర్యం కల్పించాలని, మహబూబాబాద్ వయా ఇనుగుర్తి మీదుగా వరంగల్‌కు, మహబూ బాబాద్ వయా కేసముద్రం మీదుగా గూడూరుకు అదనపు బస్ సర్వీసులు నడిపించాలని ఫోన్ల ద్వారా ప్రజలు కోరినట్లు డీఎం తెలిపారు. ప్రయాణికులు, ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు డీఎం పేర్కొన్నారు. కాగా ఆర్టీసీ బస్సులు, ఆదనపు ట్రిప్పుల కోసం మా ఊరికి బస్సు వేయండంటూ డయల్ యువర్ కార్యక్రమంలో ప్రజలు తమ వినతులు సమర్పించారు.
ఒకే ఈతలో రెండు దూడలు
గార్ల: మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన రైతు భూక్య శంకర్‌కు చెందిన ఆవు ఆదివారం ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. ఉగాది పండుగ రోజు రెండు దూడలు పుట్టడంతో రైతు కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. కాగా దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని రైతు పేర్కొన్నారు. ఈ విషయంపై పశువైద్యుడు సురేశ్‌కుమార్‌ను సాక్షి వివరణ కోరగా రెండు అండాలు ఫలధీకరణ చెంది విడిపోవడం వల్ల ఆవు రెండు దూడలకు జన్మనిచ్చిందని, ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని ఆయన చెప్పారు.
కొమ్మాల జాతరకు
పోటెత్తిన భక్తులు
గీసుకొండ: ఉగాది పర్వదినం సందర్భంగా మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు రామాచారి, ఫణి, విష్ణు.. ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
విద్యాకళాశాలలో
ఆర్థిక అవకతవకలు!
కేయూ క్యాంపస్: కేయూ విద్యా కళాశాలలో ఆర్థిక అవకతవకలు, లావాదేవీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ కళాశాల మాజీ పిప్రిన్సిపాల్, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ రణధీర్‌రెడ్డికి ఇప్పటికే రిజిస్ట్రార్ వి.రామచంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రణధీర్‌రెడ్డి కూడా అధికారులకు వివరణ ఇచ్చారు. కళాశాలలో అవకతవకలు ఏమైనా జరిగాయా అని పరిశీలించేందుకు ఇటీవల వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అప్రూవల్ మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్‌గా కేయూ అకడమిక్ ఆడిట్ డీన్ ప్రొఫెసర్ జి.హనుమంతు, ,కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ తోట రాజయ్యను సభ్యులుగా నియమించారు. అకౌంట్స్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె. శ్రీలతను మెంబర్ కన్వీనర్‌గా నియమించారు. ఈ కమిటీ త్వరలో విచారణ పూర్తిచేసి తగిన నివేదికను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గుప్త నిధుల కోసం తవ్వకాలు...?


