యువతకు ఆర్థిక దన్ను !
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ రాజీవ్‌యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతకు రుణాలు అందజేయనున్నారు. ఈమేరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్వయం ఉపాధికి రుణాలు అందజేసి యువత ఆర్థిక సాధికారత సాధించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అర్హులకు అందజేయాలని..
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల శాఖ అధికారులతో ఇప్పటికే కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పథకం నియమ నిబంధనలు తెలిపారు. అర్హులైన యువతకు పథకం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా అర్హత గల యువతకు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణం అందజేస్తారు.
ఏప్రిల్ 5వరకు..
ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా.. అదే నెలలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయితీ రుణ మంజూరు పత్రాలను కలెక్టర్ చేతులమీదుగా అందజేస్తారు. కాగా రూ.లక్షకు 80శాతం, రూ.2లక్షలకు 70 శాతం, రూ.2లక్షలకు పైన రుణాలకు 60 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. రూ.50వేల రుణం తీసుకున్న వారికి 100శాతం సబ్సిడీ ఉంటుంది.
పాత దరఖాస్తులకు స్వస్తి..
2020–21లో సబ్సిడీ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం లేదు. ఇదిలా ఉండగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తుదారులకు ఊరట లభించింది. బీసీ బంధు, మైనార్టీ బంధులో రూ.లక్ష ఆర్థిక సాయం పొందిన వారిని పక్కనబెట్టింది. ఎస్సీ, ఎస్టీ రుణాల యూనిట్లకు ఎంపికై బ్యాంకు ఖాతాల్లో డబ్బుల జమ కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా నిరాశే మిగిలింది.
ఏప్రిల్ 5వరకు అవకాశం
అర్హులైన ప్రతి ఎస్సీ యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో ఎస్సీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఈ సంవత్సరంలో జారీ చేసినవి ఉండాలి. సమాచారం కోసం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలి..
– కె. శ్రీనివాస్‌రావు,
ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి
ఐదేళ్ల వరకు అవకాశం ఉండదు
ప్రభుత్వ నుంచి ఒక్కసారి రుణం పొంది ఉన్న వారికి ఐదు సంవత్సరాల వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రుణ సహాయం అందదు. బీసీ బంధు పొందిన వారు అనర్హులు. రాజీవ్ యువవికాసం ద్వారా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రుణ సహాయం అందిస్తుంది. అవకాశం ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలి.
–బి.నర్సింహారావు,
బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి
రాజీవ్ యువ వికాసం పథకంతో
ఆర్థిక సాధికారత
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ
యువతకు అవకాశం
ఏప్రిలో 5వతేదీ వరకు
దరఖాస్తుల స్వీకరణ
రూ.4లక్షల వరకు రుణం
యువతకు ఆర్థిక దన్ను !
యువతకు ఆర్థిక దన్ను !


