సన్నబియ్యం పంపిణీ షురూ..
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజాప్రతినిధులు, తహసీల్దార్లు, ఆర్‌ఐలు, డీసీఎస్‌ఓ అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించా రు.ఈనెల జిల్లాకు 4,602 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించగా.. షాపులకు 2,913 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశారు. కాగా సన్నబియ్యం తీసుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 558 షాపులు
జిల్లా వ్యాప్తంగా 558 రేషన్ షాపులు ఉన్నాయి. కాగా, అన్ని రకాలు కలిపి మొత్తం 2,40,543 రేషన్ కార్డులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రతీనెల 1నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాలి. ఒకవేళ సాంకేతిక సమస్య తలెత్తితే పంపిణీ గడువు పెంచాల్సి ఉంటుంది. ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు లేదా సాయంత్రం 4నుంచి రాత్రి 8గంటల వరకు పంపిణీ చేయాలని డీసీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్ తెలిపారు. కాని జిల్లాలో మాత్రం డీలర్లు ఉదయం సమయంలో మాత్రమే ఇస్తున్నారు. ఐరీష్, బయో మెట్రిక్ విధానంతో పంపిణీ చేస్తున్నారు.
జిల్లాకు 4,602 మెట్రిక్ టన్నులు..
రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోంది.కాగా జిల్లాలో 558 రేషన్ షాపులు ఉండగా వాటికి 4602.122 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కేటాయించారు. కాగా ఈనెల 1వ తేదీ వరకు 2913.809 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశారు. ఇంకా 1,688.313 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. జిల్లాలో మానుకోట, కేసముద్రం, మరిపెడ, తొర్రూరు, కొత్తగూడ, గార్లలో మండల లెవల్ స్టాకింగ్ (ఎంఎల్‌ఎస్) గోదాంలు ఉన్నాయి. వాటి ద్వారా షాపులకు సరఫరా చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 40,000మెట్రిక్ టన్నుల సన్న బియ్యం నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అవి సుమారు 9 నెలలు సరిపోతాయని పేర్కొన్నారు.
షాపుల వద్ద క్యూ..
ఈనెల 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కాగా నియోజకవర్గాలు, మండలాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈనెల 2నుంచి అన్ని షాపుల్లో పంపిణీ ప్రారంభమైంది. కాగా షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. లబ్ధిదారులు కొన్ని సంవత్సరాలుగా షాపులకు వచ్చి దొడ్డు బియ్యం తీసుకెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. రేషన్ డీలర్లు ఫోన్ చేసిన కూడా పెద్దగా స్పందించలేదు. అయితే ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీతో షాపులు కళకళలాడుతున్నాయి.
షాపుల వద్ద లబ్ధిదారుల క్యూ
జిల్లాలో 2,40,543 రేషన్ కార్డులు
ఈనెల 4,602 మెట్రిక్ టన్నుల
బియ్యం కేటాయింపు


