మరోసారి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీ ఒకేషనల్, బీసీఏ కోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు మరోసారి నిర్వహించా లని పరీక్షల విభాగం అధికారులు నిర్ణయించారు. కొన్నినెలల క్రితం ఆయా సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాక మార్చి 4న ఫలితాలు వెల్లడించిన విష యం తెలిసిందే. ఉత్తీర్ణత శాతం తక్కువ వచ్చింది. ఈ క్రమంలో ఆయా సెమిస్టర్ల పరీక్షలు మరోసారి నిర్వహించాలని యూనివర్సిటీ అధికారుల దృష్టికి కొందరు తీసుకెళ్లారు. ఒక విధంగా దీనిని సప్లిమెంటరీ పరీక్షలు భావించవచ్చు. ఈ పరీక్షలను ఈ నెల మూడో వారం నుంచి నిర్వహించబోయే డిగ్రీ కో ర్సుల 2,4, 6 సెమిస్టర్ పరీక్షలతోపాటు జరపాలని నిర్ణయించారు. శుక్రవారం పరీక్ష ఫీజు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సెమిస్టర్ విధానం వచ్చాక ఒకసారి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇచ్చాక వెంటనే మళ్లీ అవే పరీక్షలు నిర్వహించడం లేదు. యూనివర్సిటీ చరిత్రలో మొదటిసారి మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల అవకాశం ఇస్తుండడంతో ఫెయిలైన విద్యార్ధులకు మంచి అవకాశంగా భావించవచ్చు.
21వేలకుపైగా రీవాల్యుయేషన్ దరఖాస్తులు
డిగ్రీ కోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలపై రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు స్వీకరించగా 21వేలకుపైగా వచ్చాయి. ఈ సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించేలోపే రీవాల్యుయేషన్ ఫలితాలు ఇస్తే బెనిఫిట్స్ పొందిన విద్యార్థులు మళ్లీ రాయాల్సిన అవసరం ఉండదనే విషయాన్ని గుర్తించి త్వరగా ఆ ప్రక్రియ పూర్తిచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
పీజీ కోర్సుల సెకండియర్
రెండో సెమిస్టర్ పరీక్షలు
ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంఎస్‌డ బ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ తదితర పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) రెండో సంవత్సరం విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈనెల 26వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సౌజన్య గురువారం తెలిపారు. ఈనెల 26, 28, 30, మే 2, 5, 7 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కేయూ వెబ్‌సైట్‌లో ఉందని వారు తెలిపారు.
1,3,5 సెమిస్టర్లలో ఫెయిలైన వారికి సదావకాశం
నేడు పరీక్ష ఫీజు నోటిఫికేషన్


