మహబూబాబాద్: అధికారులు అంకితభావంతో పని చేసి పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ అద్వైత్‌కుమార్ అధ్యక్షతన అభివృద్ధి, సంక్షేమపథకాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు మంజూరు చేయాలని, గ్రామాల్లో విద్యుత్, తాగు నీరు తదితర సమస్యలు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీర బ్రహ్మచారి, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ నరేశ్, డీఎస్పీ తిరుపతిరావు, మానుకోట, తొర్రూరు ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, డీఈఓ రవీందర్ రెడ్డి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
అవగాహన కల్పించాలి..
నెహ్రూసెంటర్: సికిల్‌సెల్ ఎనిమియాపై ప్రజలకు అవగాహన కల్పించాలనిజాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో సికిల్‌సెల్ ఎనిమియాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో స్క్రీనింగ్ నిర్వహించి 12 కేసులను గుర్తించారని వారికి సరైన చికిత్స అందించాలన్నారు. కాగా తమకు వేతనాలు పెంచి ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,ఈఎఫ్, ఈఎస్‌ఐ ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్‌కు ఆశకార్యకర్తలు వినతిపత్రం అందజేశారు.
ప్రతీఒక్కరు మొక్కలు నాటాలి..
మహబూబాబాద్ రూరల్: ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమాన్ని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జిల్లా అటవీశాఖ అధికారి విశాల్‌తో కలిసి హుస్సేన్‌నాయక్ మొక్కలు నాటారు.
ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి
గూడూరు: అధికారులు మారుమూల ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ అన్నారు. మండలంలోని మట్టెవాడ శివారు నేలవంచ గ్రామాన్ని శుక్రవారం పలు శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
జాటోత్ హుస్సేన్‌నాయక్


