బాలుడిని ఢీకొన్న లారీ..
● అక్కడికక్కడే చిన్నారి దుర్మరణం ● పుల్లయ్యబోడుతండా వద్ద ఘటన
నర్సంపేట: రోడ్డు పక్కన నిలబడిన ఓ బాలుడిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం పుల్లయ్యబోడుతండా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్య వెంకన్న, జ్యోతి దంపతుల కుమారుడు అనిల్(9) అ యోధ్యపురం ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. వెంకన్న, జ్యోతి దంపతుల ఇల్లు తండా ప్రధాన రహదారి పక్కన ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం గూడూరు మండలం అయోధ్యపురం క్రషర్ మిల్లు నుంచి ఓ లారీ నెక్కొండ వైపునకు వెళ్తోంది. పుల్లయ్యబోడుతండా సమీపంలో కి రాగానే రోడ్డు పక్కన నిలబడిన అనిల్‌ను ఢీకొంది. దీంతో బాలుడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీనిని గమనించిన తండావాసులు లారీని ఆపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను చితకబాదారు. విషయం తెలుసుకున్న చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం 108లో నర్సంపేటకు తరలించారు. అప్పటి దాకా కళ్ల ముందే కదలాడిన కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో ఆ చిన్నారి మృతదేహంపై పడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. బిడ్డా లే.. బిడ్డా లే.. అంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై బాలుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు.
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు..
● యువకుడి మృతి ● తిర్లాపురంలో ఘటన
గార్ల: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి గార్ల మండలం తిర్లాపురం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిర్లాపురం గ్రామానికి చెందిన ఒంటెపాక శివకుమార్(23) తన స్నేహితులు నరేశ్, ప్రకాశ్‌తో కలిసి కారులో గార్ల నుంచి తిర్లాపురం వెళ్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ ప్రకాశ్ కారును అతివేగంగా నడుపుతూ డబ్బాలమోరీ వద్ద రోడ్డు పక్కన చెట్టును ఢీకొన్నాడు. దీంతో కారులో ప్రయాణిస్తున్న శివకుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హుటాహుటిన మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతిచెందాడు. మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, ఒక్కగానొక్క కొడుకు కారు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లి సావిత్రి.. కుమారుడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్‌కె. రియాజ్‌పాషా తెలిపారు.
వడదెబ్బతో మహిళా కూలీ మృతి
గార్ల: వడదెబ్బతో ఓ మహిళా కూలీ మృతి చెందింది. ఈఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం జీవంజిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాదంపూడి సుశీల(57) గార్ల జీపీ గండితండా గ్రామ సమీపంలో మిరపతోటలో కాయలు ఏరేందుకు వెళ్లింది. ఈక్రమంలో నీళ్లు తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. సహ కూలీలు వచ్చి సీపీఆర్ చేసినా అప్పటికే మృతిచెందింది. కాగా, మృతురాలి భర్త 15 ఏళ్ల క్రితం చనిపోగా రోజూ కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. మృతురాలి ఒక కూతురు సంతానం. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
వేలుబెల్లిలో వృద్ధురాలు..
కొత్తగూడ: వడదెబ్బతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని వేలుబెల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రెండు రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం, వడగాలులు వీస్తుండడంతో గ్రామానికి చెందిన బాసాని మల్లమ్మ(75) మంగళవారం వడదెబ్బకు గురై కుప్పకూలింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి కుమారుడు కట్టయ్య ఉన్నాడు.
గుండెపోటుతో భక్తుడు మృతి
● కాళేశ్వరాలయ ఆవరణలో ఘటన ● కాసేపు ఆలయం మూసివేత
● సంప్రోక్షణ తర్వాత యథావిధిగా పూజలు
కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థాన ఆవరణలో ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన రాంపల్లి కనుకయ్య(72) కుటుంబ సభ్యులతో కలసి కాళేశ్వరం వచ్చాడు. కుమారుడు కాలసర్ఫనివారణ పూజలు చేసుకుంటుండగా..మృతుడు ఆలయ ఆవరణలోని ఓ హోటల్ వద్ద కూర్చోని మాట్లాడుతుండగానే ఛాతీలో నొప్పితో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలోనే మృతి చెందాడు.
కాసేపు ఆలయం మూసివేత..
కనుకయ్య ఆలయ ఆవరణలో మృతి చెందిన విషయం దేవస్థాన అధికారులకు తెలియడంతో ఆలయాన్ని ఉదయం 8.10 గంటల నుంచి సుమారు గంటన్నరపాటు మూసివేశారు. ఆ తర్వాత సంప్రొక్షణ జరిపి యథావిధిగా పూజలు పునఃప్రారంభించారు. దీంతో భక్తులు పూజల్లో పాల్గొన్నారు.
శివకుమార్ (ఫైల్)
సుశీల(ఫైల్)
బాలుడిని ఢీకొన్న లారీ..
బాలుడిని ఢీకొన్న లారీ..
బాలుడిని ఢీకొన్న లారీ..
బాలుడిని ఢీకొన్న లారీ..


