అసత్య ప్రచారాలు మానుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: వక్ఫ్ బిల్లు రద్దుపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం రచించిన ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు సమాన స్వేచ్ఛ హక్కులు కల్పించారని, మైనార్టీలకు కూడా బీజేపీ ప్రభుత్వం అన్ని సమాన హక్కులు కల్పిస్తుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం 106 సార్లు సవరణ జరిగిందని, 1954, 1955, 2013లో వక్ఫ్ బోర్డు బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వామే సవరించిందని గుర్తు చేశారు. ప్రతి పేద ముస్లిం, మైనార్టీ ప్రజలకు న్యాయం జరగడానికే ప్రధాన మంత్రి వక్ఫ్ బోర్డు బిల్లు సవరించడం జరిగిందని, నేడు ఈ సవరణ బిల్లు సుప్రీంకోర్టులో ఉందని, దీనిపై విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నాయకులకు సరికాదన్నారు. బీజేపీ ఎప్పుడు ముస్లింకు వ్యతిరేకంగా కాదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మొసంగి మురళీ, చీకటి మహేష్‌గౌడ్, శ్యాంసుందర్‌శర్మ, నాయకులు గడ్డం అశోక్, తుంపిళ్ళ శ్రీనివాస్, దార ఇందుభారతి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ ప్రొఫెసర్
అజ్మీరా సీతారాంనాయక్


