సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోలు కేంద్రాల్లో చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి, ముడుపుగల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మురళీనాయక్ శుక్రవారం ప్రారంభించి, మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. నిబంధనల మేరకు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, లారీలలో మిల్లులకు తరలించిన ధాన్యాన్ని దిగుమతి చేసే దగ్గర జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే సన్నధాన్యానికి బోనస్ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టకంటి రామిరెడ్డి, ఏఓ తిరుపతిరెడ్డి, ఐకేపీ ఏపీఎం తిలక్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, సీసీలు ధనుంజయ, సుమలత, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్


