బంక్‌లో ఎలక్ట్రిక్ వస్తువులు నిల్వ చేయొద్దు
జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనాథ్
మహబూబాబాద్: పెట్రోల్ బంక్‌లలో ఎలక్ట్రిక్ వస్తువులు, కాలే గుణం ఉన్న ఎటువంటి వస్తువులు నిల్వఉంచొద్దని జిల్లా అగ్నిమాపక అధికారి సంక్రాంతి శ్రీనాథ్ అన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంక్‌లలో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ.. ప్రజలు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని.. జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే వారోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను ప్రజలు తిలకించాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది కృష్ణ, రవీందర్, గోపి, విశ్వనాథ్, రాజు, వెంకన్న, రమేష్, షఫీ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
అదృశ్యమైన బాలుడి
అప్పగింత
గూడూరు: జనవరి నెలలో ఆశ్రమ పాఠశాలకు వచ్చి అదృశ్యమైన బాలుడు ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ఉన్నాడన్న విషయం తెల్సుకున్న ఎస్సై గిరిధర్‌రెడ్డి, అక్కడికి వెళ్లి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన శుక్రవారం జరిగింది. ఎస్సై బి. గిరిధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం కోమటిపల్లికి చెందిన ఇస్లావత్ నర్సింహా కొడుకు చరణ్, గూడూరు మండలంలోని సీతానగరం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. జనవరిలో సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లిన చరణ్, సెలవులు ముగిశాక.. జనవరి 23న పాఠశాలకు వచ్చి కనిపించకుండా పోయాడు. విషయం ఆలస్యంగా తెల్సుకున్న బాలుడి తండ్రి ఇస్లావత్ నర్సింహా పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై మూడు నెలలుగా ఆరా తీసాడు. ఇటీవల ఏపీలోని రాజమహేంద్రవరంలో కూలీ పనులు చేస్తున్నాడని తెల్సుకున్నాడు. చాకచక్యంగా సిబ్బందితో కల్సి వెల్లిన ఎస్సై బాలుడిని గుర్తించి తీసుకొచ్చినట్లు తెలిపారు.
తాళంవేసిన ఇంట్లో చోరీ
నెల్లికుదురు: తాళం వేసి ఉన్న ఇంట్లో జరిగిన ఘటన ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బీరవెల్లి ఉపేంద్ర హైదరాబాద్‌లో తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి ఈ నెల 11న వెళ్లింది. అప్పటి నుంచి గ్రామానికి చెందిన ముంజపల్లి యాకాలు, పూలమ్మ దంపతులు ఉపేంద్ర ఇంటి పనులు చేస్తున్నారు. శుక్రవారం ఇంట్లో పనులు చేయడానికి వచ్చిన వారికి ఇంటి తాళం పగులగొట్టి కన్పించడంతో ఉపేంద్ర సమీప బంధువు( కొడుకు వరుస) అయిన గ్రామానికి చెందిన బీరవెల్లి మధుసూదన్‌రెడ్డికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి అందులో ఉన్న చంద్రహారం, చెవి కమ్మలు, రూ.10వేల నగదు, కలర్ టీవీ అపహరణకు గురైనట్లు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భద్రకాళి సన్నిధిలో ఐటీడీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ఐటీడీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ బానోత్ శరత్‌నాయక్ కుటుంబసమేతంగా సందర్శించారు. వారిని ఆలయ అధికారులు స్వాగతించారు. ముందుగా వారు ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆనంతరం శరత్‌నా యక్ దంపతులకు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.
బంక్‌లో ఎలక్ట్రిక్ వస్తువులు నిల్వ చేయొద్దు


