మహబూబ్‌నగర్: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు.. కానీ, వారి ప్రేమ పెళ్లిలో వారం రోజులు గడవక ముందే విషాదం నిండింది. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లి పుట్టింటికి వచ్చిన నవ వధువును తిరిగి భర్తతో పంపించలేదని మనస్తాపానికి గురైన ఆమె క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురుకుంటకు చెందిన పిల్లి అంజమ్మ మూడేళ్ల క్రితం భర్త చనిపోవడంతో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
ఆమెకు ఇద్దరు కుమార్తెలు పిల్లి అనూష(19), శివాని ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన అనూష ఇంటివద్దే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన బోయని శివశంకర్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉంది. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబసభ్యులు మొదట అభ్యంతరం చెప్పగా.. ఇద్దరు వారి కుటుంబాలను ఒప్పించారు. దీంతో ఈ నెల 12న గ్రామ సమీపంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో అందరి సమక్షంలో వివాహం జరిగింది. కాగా పెళ్లి అయిన అనంతరం వడిబియ్యం వండుదామని ఈ నెల 15న కూతురు అనూష, అల్లుడు శివశంకర్‌ను పిల్లి అంజమ్మ తన ఇంటికి తీసుకొని వచ్చింది.
కాగా ఆ మరుసటి రోజు తన భార్యను తీసుకువెళ్తానని అల్లుడు చెప్పగా.. కొత్త పెళ్లి కూతురిని పుట్టింటి నుంచి మంగళవారం పంపించొద్దని.. బుధవారం చిన్న కూతురు శివానికి పరీక్ష ఉండడంతో.. గురువారం పంపిస్తానని అత్త అంజమ్మ అల్లుడికి చెప్పింది. దీంతో తనను భర్తతో పంపించడం లేదని మనస్తాపం చెందిన అనూ ష బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి అప స్మారక స్థితికి చేరింది.
గమనించిన చుట్టుపక్కల వారు అంజమ్మకు, శివశంకర్‌కు సమా చారం ఇచ్చారు. వెంటనే వారు వచ్చి 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఈ ఘటనపై అనూష తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పురుషోత్తం తెలిపారు. అనూష క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment