మల్దకల్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన శుక్రవారం మండలంలోని చర్లగార్లపాడులో చోటుచేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరాలు.. చర్లగార్లపాడుకి చెందిన ఈరమ్మ భర్త నర్సింహులకు ఇద్దరు సంతానం. వారికి ఉన్న కొద్ది పాటి వ్యవసాయ పొలంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఈరమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
● భార్యే చంపిందని పోలీసులకు
ఫిర్యాదు చేసిన మృతుడి అక్క
నర్వ: మండలంలోని లంకాల్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు ఎస్‌ఐ కురుమయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన పాలెం అంజన్న (41)కు 17 ఏళ్ల కిందట మక్తల్ మండలం కర్నికి చెందిన రంగమ్మతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. అంజన్న నారాయణపేటలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో అటెండర్‌గా విధులు నిర్వర్తించేవాడు. అంజన్న ఇటీవల తన పేరున ఉన్న భూమిలో కొంతభాగాన్ని దాయాదులకు పట్టా చేయడంతో భార్య తరచూ గొడవ పడేది. అలాగే కొంత భూమి అమ్మగా వచ్చిన డబ్బులు ఇవ్వాలని, మిగిలిన భూమిని తన పేరున పట్టా చేయాలంటూ వేధించేది. అంజన్న మృతిచెందినట్లు గ్రామస్తులు శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అక్క దుప్పల్లి పద్మమ్మకు సమాచారం అందించారు. ఆమె వచ్చి చూడగా మెడ చుట్టూ తాడు బిగించి చంపినట్లు కందిన గాయాలు కనిపించడంతో తమ్ముడి మృతిపై అనుమానం ఉందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్క ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.
ఫ అంజన్న మృతిపై నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. మెర్సీ వసంత, జూనియర్ అసిస్టెంట్ రంగారెడ్డి, సూపరింటెండెంట్ జయపాల్, ఇతర సిబ్బంది నివాళులు అర్పించారు.
వ్యక్తి బలవన్మరణం
బిజినేపల్లి: మండలంలోని మంగనూర్‌కు చెందిన దాసరి చిన్నయ్య (32) గురువారం రాత్రి గ్రామంలోని ఓ రైస్‌మిల్లు వద్ద నిలిపిన డీసీఎం వాహనానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రెండో ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. చిన్నయ్య డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తుండేవాడని.. కొద్దిరోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. చిన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మహిళ మృతదేహం లభ్యం
వెల్దండ: మండలంలోని రాఘాయపల్లి సమీపం హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైందని ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందినట్లు వివరించారు. వయోలెట్ రంగు నైటీ ధరించిందని.. మతిస్థిమితం సరిగా లేక భిక్షాటన చేసే మహిళ అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పెద్దాపూర్ కార్యదర్శి సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 87126 57756, 87126 61808, 87126 57755 సంప్రదించాలని సూచించారు.
కేసరి సముద్రంలో
వ్యక్తి మృతదేహం..
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలోని కేసరి సముద్రం చెరువులో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ గోవర్ధన్ వివరించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మరిన్ని వివరాలకు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
రైలు కిందపడి
మహిళ ఆత్మహత్య
మహబూబ్‌నగర్ క్రైం: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ఎస్‌ఐ సయ్యద్ అక్బర్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్ బ్రిడ్జి కింద శుక్రవారం గుర్తు తెలియని మహిళ(40) రైలు కిందపడటంతో శరీరం రెండు ముక్కలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం