ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన అంతంతే
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు జడ్చర్ల (బాదేపల్లి), భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. వాస్తవానికి 2020 ఆగస్టు 26 నాటికి ముందు డీటీసీపీ అనుమతులు లేకుండా వెంచర్లు వేసి విక్రయించిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ చేపట్టింది. దీంతో అప్పట్లోనే ప్లాట్లు కొనుగోలు చేసిన వారు రూ.వెయ్యి చొప్పున, అలాగే వెంచర్‌దారులు మిగిలిపోయిన ప్లాట్లకు సంబంధించి రూ.10 వేల చొప్పున ఆయా మున్సిపాలిటీలలో చెల్లించారు. వివిధ కారణాలతో అదే ఏడాది అక్టోబర్ 15 వరకే దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఆ తర్వాత 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికోసం మార్చి నెల 31లోగా చెల్లించేవారికి మొత్తం ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించారు. ఈ విషయమై క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించినప్పటికీ దరఖాస్తుదారులు ఎక్కువగా ముందుకు రాకపోవడం గమనార్హం. కాగా, ఈ ప్లాట్లను క్రమబద్ధీకరించుకుంటే చట్టబద్ధతతోపాటు అలాంటి వాటికే మార్కెట్‌లో విలువ పెరుగుతుందని, డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, బ్యాంకర్లు సైతం హౌసింగ్ లోన్స్ వెంటనే ఇస్తారన్నది వారు గుర్తించడం లేదు.
జిల్లావ్యాప్తంగా 43,562 దరఖాస్తులకు అనుమతి
7,335 మంది మాత్రమే ఫీజు చెల్లింపు
ప్రభుత్వానికి సమకూరిన రూ.20.99 కోట్ల ఆదాయం
అవగాహన కల్పించినా ముందుకు రాని ప్లాట్ల యజమానులు


