అంగన్‌వాడీల్లో గోల్‌మాల్
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కేంద్రాలకు హాజరవుతున్న చిన్నారులు, గర్భిణుల సంఖ్యకు ఆయా కేంద్రాల నిర్వాహకులు రిజిస్టర్‌లో నమోదు చేస్తున్న సంఖ్యకు పొంతన కుదరడం లేదు. ఇంత జరుగుతున్నా జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు మాత్రం బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను ‘సాక్షి’ విజిట్ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, కనీసం ఫ్యాన్లు కూడా ఉండటం లేదని చిన్నారుల తల్లులు చెబుతున్నారు. జిల్లాకేంద్రం పరిధిలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.
● తక్కువ హాజరును ఎక్కువగా చూపుతున్న వైనం
● పిల్లలు, గర్భిణులు రాకున్నా వచ్చినట్లు లెక్కలు
● చర్యలకు వెనుకాడుతున్న ఐసీడీఎస్ అధికారులు
లెక్కల్లోనే పిల్లలు
జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో మహబూబ్‌నగర్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోనే జిల్లా అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నా మిగిలిన ప్రాజెక్టులలో ఉన్నతాధికారులు తనిఖీలు నామమాత్రంగానే ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయా ప్రాజెక్టుల అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్రీ స్కూల్ విద్యార్థులతో పాటు గర్భిణులు, బాలింతల హాజరు శాతం గణనీయంగా తగ్గుతోంది. దీంతో పాటు ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు వస్తున్న పౌష్టికాహారం, రోజువారి హాజరు శాతంతో పాటు రిజిస్టర్‌లో ఉన్న హాజరుశాతానికి వ్యత్యాసం భారీగానే ఉన్నా మిగిలిన పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీ టీచర్లు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఐసీడీఎస్ అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
అంగన్‌వాడీల్లో గోల్‌మాల్


