జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మాన్యూవల్ స్కావెంజర్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ పారదర్శకంగా గోప్యతకు తావులేకుండా సర్వే నిర్వహించి రిపోర్టు తయారు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నమస్తే స్కీమ్, నమస్తే పోర్టల్ ద్వారా దేశం మొత్తం మాన్యూవల్ స్కావెంజింగ్ ఇంకా ఎక్కడైనా జరుగుతుందా అని తెలుసుకునేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో సర్వే కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ చైర్మన్‌గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మెంబర్ సెక్రటరీగా, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, రైల్వేస్టేషన్ మాస్టర్ సభ్యులుగా, సీఐటీయూ స్టేట్ లీడర్ కమ్యూనిటీ ప్రతినిధిగా కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్వే చేసేందుకు ఎన్యుమరేటర్స్‌ను ఎంచుకొని, వారికి ఎంఎస్ యాప్‌పై శిక్షణ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సుదర్శన్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, డీపీఓ పార్థ సారథి, సీఐటీయూ నాయకుడు వెంకటేష్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
సెర్ప్ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలి
సెర్ప్ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈఓ డి.దివ్యతో కలిసి వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీలకు పెండింగ్ కమిషన్ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత యాసంగి సీజన్‌లో మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను ఆదేశించారు. 2022–23కి సంబంధించిన పౌర సరఫరాల శాఖ వద్ద పెండింగ్ ఉన్న కమీషన్ వివరాలు అందజేయాలన్నారు. డీఆర్డీఓ నర్సింహులు, ఎల్‌డీఎం.భాస్కర్, అదనపు డీఆర్‌డీఓ జోజప్ప, సీఎంఓ బాలునాయక్, తదితరులు పాల్గొన్నారు.


