మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో రంజాన్ పండగ నేపథ్యంలో ఈద్గాల వద్ద భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ జానకి ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులతో ఆదివారం ఎస్పీ టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముస్లింలు రంజాన్ పండగ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈద్గాలతోపాటు మసీదుల దగ్గర సైతం బందోబస్తు ఉండాలని సూచించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. జిల్లాలో పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారని, ఎవరూ కూడా భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక నమాజ్‌లు చేసే ఈద్గాల దగ్గర అదనపు బలగాలను బందోబస్తుకు కేటాయించినట్లు వివరించారు. ట్రాఫిక్ కట్టడి, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ, క్యూఆర్‌టీ మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని బందోబస్తు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా అత్యవసరం అయితే పోలీస్ కంట్రోల్ రూంను సంప్రదించాలని సూచించారు.


