ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు పెంచాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రకటించిన 25 శాతం రాయితీని ఈ నెలాఖరు వరకు పొడిగించాలని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, కార్యదర్శి నాగభూషణం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ మహేశ్వర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కారణాలతో వేలాది మంది దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ఎంతోమంది దూర ప్రాంతాల్లో ఉండటం, మరికొందరు అందుబాటులో లేకపోవడంతోపాటు పండగలు, ఇతర సెలవు దినాలు రావడంతో పూర్తిస్థాయిలో ఫీజు చెల్లించలేకపోయారన్నారు. అంతేగాక వెంచర్లు చేస్తున్న బిల్డర్లు సంబంధిత గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయం, ముడా నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ప్లాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వెంచర్లలో పది శాతం ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టి ప్లాట్లు చేయాల్సి ఉండగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పుడు వాటికి సంబంధించిన ఫీజును సైతం ప్లాట్ల యజమానులే భరించాలనడం సరికాదన్నారు. వెంచర్లు చేసిన వ్యాపారుల నుంచే ఆ రుసుం వసూలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం నాయకులు అనంతరెడ్డి, అహమ్మద్, రాజసింహుడు తదితరులు పాల్గొన్నారు.


