ఉరేసుకొని యువకుడు బలవన్మరణం
నాగర్‌కర్నూల్ క్రైం: ఇంట్లో ఉరేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక బీసీ కాలనీకి చెందిన సాయికుమార్(20) డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మృతిచెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈఘటనకు సంబంధించి ఎస్‌ఐ గోవర్ధన్‌ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
లింగాల: మండలంలోని కొత్తకుంటపల్లికి చెందిన సౌడమోని మధు(22) చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ఈ నెల 2వ తేదీన ద్విచక్ర వాహనంపై వరికోత మిషన్ కోసం అంబట్‌పల్లి వైపు తమ్ముడు సాయితో కలిసి వెళ్లాడు. ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో మధు తలకు బలమైన గాయం కాగా, సాయికి స్వల్ప గాయాలయ్యాయి. మధును నిమ్స్‌కు తరలించగా కోలుకోలేక చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం మృతుడి తండ్రి సౌడమోని శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు నుంచి పడి
వ్యక్తి..
ఎర్రవల్లి: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు రైల్వే కానిస్టేబుల్ అశోక్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఇటిక్యాల మండలం పూడూరు–ఇటిక్యాల రైల్వేస్టేషన్ మధ్యలో కి.మీ. 204/2–3 వద్ద 45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి గురువారం రాత్రి రైలులో నుంచి కిందపడి మృతి చెందినట్లు చెప్పారు. గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గద్వాల మార్చురీకి తరలించినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు గద్వాల రైల్వే పోలీస్ నంబర్ 83412 52529 సంప్రదించాలని సూచించారు.
డిగ్రీ విద్యార్థి బలవన్మరణం
బల్మూర్: మండలంలోని తుమ్మెన్‌పేట గ్రామంలో అరవింద్(20) అనే డిగ్రీ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తోకల తిరుపతయ్య కుమారుడు అరవింద్ హైదరా బాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఉగాది పండుగకు ఇంటికి వచ్చిన అరవింద్ ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. కాగా విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎలాంటి ఫి ర్యాదు అందలేదని ఎస్‌ఐ రమాదేవి తెలిపారు.
చెరువులో
మృతదేహం లభ్యం
పాన్‌గల్: మండల కేంద్రంలోని పొల్కి చెరువులో శుక్రవారం 40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. మూడురోజుల కిందట చనిపోయి ఉంటాడని.. ఘటన స్థలంలో చెప్పులు, శాలువా, కల్లు ప్యాకెట్ కనిపించినట్లు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని.. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 87126 70616, 87125 83613 సంప్రదించాలని సూచించారు.
వృద్ధురాలిపై దాడిలో
ఇద్దరిపై కేసు నమోదు
పాన్‌గల్: వృద్ధురాలిపై దాడిచేసి గాయపర్చిన ఘటనపై శుక్రవారం ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు.. మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన ఆవుల బాలమ్మ అనే వృద్ధురాలికి కూతురు, కుమారుడు ఉన్నారు. వీరిద్దరికి పెళ్లిళ్లు కావడంతో వృద్ధురాలు ఆమె భర్త బాలస్వామి ఇద్దరు వేరుగా నివాసం ఉంటున్నారు. కుమారుడితో కుటుంబ విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదేక్రమంలో గతనెల 29వ తేదీన ఇంటి దగ్గరిలోని నల్లా వద్ద వృద్ధురాలు నీళ్లు పడుతున్న క్రమంలో కోడలు అనిత బిందెను పక్కకు తోసేసి దుర్భాషలాడింది. కుమారుడు ఆంజనేయులు వచ్చి ఇనుప రాడ్‌తో వృద్ధురాలి తలపై దాడి చేయగా రక్తగాయాలయ్యాయి. అనిత, ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని బాలమ్మ శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉరేసుకొని యువకుడు బలవన్మరణం
ఉరేసుకొని యువకుడు బలవన్మరణం


