కంచె సమీపంలో తవ్వకాలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో పనులు వేగవంతమయ్యాయి. అధికారులు అదనంగా మరో మూడు ఎస్కవేటర్లు ఏర్పాటు చేసి పనులు చేపడుతున్నారు. సొరంగం లోపల కట్ చేసిన టీబీఎం భాగాలు, మట్టి, బురద, రాళ్లను బయటకు తరలిస్తున్నారు. కన్వేయర్ బెల్టు పనులు వంద మీటర్ల ముందుకు పొడిగించడంతో సొరంగంలో తవ్విన మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు పంపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 రకాల బృందాలు మూడు షిఫ్ట్‌లలో 24 గంటలపాటు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కంచె ఏర్పాటు చేసిన నిషేధిత ప్రదేశం సమీపంలో సహాయక సిబ్బంది పనులు చేపడుతున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశం నుంచి భారీగా వస్తున్న నీటి ఊటను 150 హెచ్‌పీ మోటార్లతో 2.5 కిలోమీటర్లకు ఒకటి, రెండు ఏర్పాటు చేసి నీటిని బయటకు తోడేస్తున్నారు. నీటి పారుదల, జీఎస్‌ఐ అధికారులు నిరంతరం సొరంగం ప్రమాద ప్రదేశం వద్ద ఉంటూ తగిన సలహాలు, సూచనలు చేస్తున్నారు.
మట్టి తవ్వకాలు వేగవంతం
సొరంగం లోపల మట్టి తవ్వకాలు వేగవంతం చేశామని, వెంటిలేషన్ పనులు కొనసాగిస్తున్నామని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. శనివారం సొరంగం జేపీ కార్యాలయం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించి సొరంగం లోపల చేపడుతున్న సహాయక చర్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, సొరంగంలో చిక్కుకున్న ఆరుగురి కోసం సహాయక సిబ్బంది నిర్విరామంగా గాలింపు చేస్తూ అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతున్నారని వివరించారు. సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న అన్ని పరిస్థితులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్‌కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు
43 రోజులుగా చిక్కని కార్మికుల ఆచూకీ


