నిర్మాణంలో ఉన్న రోడ్డుపై పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

నిర్మాణంలో ఉన్న రోడ్డుపై పడి వ్యక్తి మృతి

Apr 6 2025 12:48 AM | Updated on Apr 6 2025 12:48 AM

నిర్మాణంలో ఉన్న  రోడ్డుపై పడి వ్యక్తి మృతి

నిర్మాణంలో ఉన్న రోడ్డుపై పడి వ్యక్తి మృతి

గట్టు: దారితప్పి వచ్చిన ఓ వ్యక్తి నిర్మాణంలో ఉన్న భారత్‌ మాల రోడ్డుపై పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కర్ణాటకలోని యరగెరకు చెందిన వికలాంగుడు కర్లీ శ్రీనివాసులు(55) శుక్రవారం గద్వాలలో శుభకార్యానికి హాజరై సాయంత్రం ఆరగిద్దలో ఉన్న కూతురికి దగ్గరకు బయలుదేరాడు. మూడు చక్రాల ద్విచక్రవాహనంపై తాటికుంట, తప్పెట్లమొర్సు మీదుగా ఆరగిద్దకు వెళ్తుండగా.. గొర్లఖాన్‌దొడ్డి– ఆరగిద్ద గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న భారత్‌మాల రోడ్డుపైకి దారి తప్పి వెళ్లాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత అదుపు తప్పి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన గొర్లఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన ఓ రైతు శ్రీనివాసులు మొబైల్‌ ఫోన్‌లోని కాల్‌ లిస్టు ఆధారంగా ఆరగిద్దకు చెందిన కూతురు, అల్లుడికి సమాచారం అందించారు. ఆరగిద్ద గ్రామస్తుల సహకారంతో 108లో గద్వాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాసులుకు భార్య లక్ష్మితోపాటు నలుగురు కుమార్తెలున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు గట్టు పోలీసులు తెలిపారు.

యువకుడి బలవన్మరణం

గద్వాల క్రైం: తల్లిదండ్రులు మందలించడంతో కుమారుడు ఉరేసుకొని మృతిచెందిన ఘటన శనివారం ఉదయం మండలంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ కథనం మేరకు.. మండలంలోని చేనుగోనిపల్లికి చెందిన ఖాజా (20) హైదరాబాద్‌లో ఓ ప్రవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. రంజాన్‌ పండుగకు గ్రామానికి వచ్చి తిరిగి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి దౌలత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

బస్సు ఎక్కబోయిన

మహిళకు తీవ్ర గాయాలు

మహమ్మదాబాద్‌: డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా బస్సు ఎక్కబోయిన మహిళ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని జూలపల్లికి చెందిన సత్యమ్మ(48) తన కూతురు రాధికతో కలిసి శనివారం జుంటిపల్లిలో జరిగే రామస్వామి ఉత్సవాలకు వెళ్లేందుకు బయలు దేరింది. సాయంత్రం నంచర్ల బస్టాండుకు చేరుకున్న వారు బస్సు కోసం చాలాసేపు వేచి చూశారు. ఎట్టకేలకు వచ్చిన బస్సు రద్దీగా ఉండటంతో ముందుగా కూతురు రాధిక బస్స ఎక్కింది. తల్లి సత్యమ్మ బస్సు ఎక్కుతుండగా డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపడటంతో ఆమె అదుపు తప్పి కిందపడింది. ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్‌ బస్సు నిలిపివేశాడు. దీంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. అంబులెన్సు అక్కడికి చేరుకొని ఆమెను మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు.

ఫోన్‌పే నుంచి

నగదు చోరీ

నాగర్‌కర్నూల్‌ క్రైం: గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ పే నుంచి నగదును చోరీకి పాల్పడినట్లు ఎస్‌ఐ గోవర్దన్‌ తెలిపారు. వివరాలు.. మండలంలోని వెంకటాపూర్‌కి చెందిన బాషమోని భాస్కర్‌ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు ఈనెల 4న హైదరాబాద్‌లో మిర్చి విక్రయించేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఫోన్‌ పడిపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి భాస్కర్‌ ఫోన్‌ ద్వారా ఫోన్‌పే నుంచి రూ.లక్షను విడతలవారీగా చోరీ చేశాడు. బాధితుడు బ్యాంక్‌ అకౌంట్‌ను చెక్‌ చేసుకోవడంతో నగదు చోరీ జరిగిట్లు గుర్తించాడు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యార్థి కిడ్నాప్‌నకు యత్నం

అచ్చంపేట రూరల్‌: పట్టణంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌నకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ రవీందర్‌ కథనం ప్రకారం... శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో హాస్టల్‌ బయట ఉన్న 8వ తరగతి చదువుతున్న మహేష్‌ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుని వెళ్లారు. తోటి విద్యార్థులు విషయాన్ని హాస్టల్‌ వార్డెన్‌కు చెప్పడంతో సిబ్బందితో పట్టణంలో వెతికారు. పట్టణంలోని లింగాల రోడ్డులో విద్యార్థిని గమనించి వెంటనే హాస్టల్‌కు తీసుకొచ్చారు. శనివారం ఉదయం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించి హాస్టల్‌ వద్దకు పిలిపించారు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి కుర్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యార్థితో గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement