డీఆర్ డిపోలకు పూర్వ వైభవం తెస్తాం
మన్ననూర్: రాష్ట్రంలోని గిరిజన కోఆపరేటివ్ సంస్థల (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీఆర్ డిపోలకు పూర్వ వైభవం తీసుకువస్తామని సంస్థ రాష్ట్ర చైర్మన్ కోట్నావత్ తిరుపతి అన్నారు. మంగళవారం మన్ననూర్‌లోని జీసీసీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను జీసీసీ మేనేజర్ సంతోష్‌కుమార్, చెంచు సంఘాల నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ ప్రాంతంలోని చెంచులు కనీస జీవనోపాదులు లేక తీవ్ర ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్నారన్నారు. గతంలో జీసీసీ ఈ ప్రాంతంతోపాటు పరిసర జిల్లాల్లో కూడా ఎంతో ప్రాధాన్యతలో కార్యక్రమాలు ఉండేవని వివరించారు. కొంతకాలంగా అటవీ ఉత్పత్తులు లేక చెంచులు జీవనోపాధి కోల్పోయి ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం, ఇతర ఉచిత పథకాలపై ఆధారపడి జీవనం గడుపుతున్నారని వాపోయారు. దక్షిణ తెలంగాణ అమరనాథ్ యాత్రగా చెప్పుకునే సలేశ్వరం ఉత్సవాలను కనీసం 5 రోజులు నిర్వహించుకునే విధంగా అవకాశం కల్పించాలని స్థానికులు కోరారు. అదేవిధంగా సంస్థలో ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా ఇప్పించాలని రిటైర్డ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. అనంతరం చెంచు సేవా సంఘం నాయకులు శంకరయ్య, రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ఎంఏ రహీం, వెంకటరమణ, గోపాల్‌నాయక్ శాలువా, పూలబోకెతో ఆయనను ఘనంగా సన్మానించారు.


