జనం నెత్తిన గుదిబండ
మహబూబ్‌నగర్ రూరల్: ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గృహవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.858.50 ఉండగా, రూ.50 పెంపుతో ఇక రూ.908.50కు చేరనుంది. జిల్లావ్యాప్తంగా ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఆయిల్ కంపెనీలకు చెందిన 18 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 2,55,837 వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ప్రతి నెల ఒక్కో సిలిండర్ తీసుకున్నా.. పెంచిన గ్యాస్ సిలిండర్ ధర వల్ల జిల్లా వినియోగదారులపై దాదాపు రూ.1,27,91,850 అదనపు భారం పడనుంది. ఏడాదికి రూ.15.35 కోట్ల అదనపు భారం పడుతుంది. మరోవైపు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు రవాణా చార్జీల పేరిట వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీలు 5 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా డోర్ డెలివరీ చేయాలి. 30 కిలోమీటర్ల లోపు రూ.10 వసూలు చేయాలి. కానీ డెలవరీ బాయ్ సిలిండర్‌కు అదనంగా రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.908.50 డెలవరీ బాయ్ చార్జీలు కలుపుకుంటే రూ.950కి చేరుతుంది.
గ్యాస్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.50 పెంపు
రవాణా చార్జీల పేరిట అదనపు దోపిడీ
జిల్లా వినియోగదారులపై ప్రతినెలా రూ.1.27 కోట్ల భారం


