చేప బక్క చిక్కింది..
సబ్సిడీ చేపల నాణ్యతపై అనుమానాలు
● చెరువుల్లో వదిలిన చేపపిల్లల వృద్ధిపై మత్స్యకారుల్లో ఆందోళన
● పావు కేజీ నుంచి అర కేజీ వరకే పెరిగిన వైనం
● జిల్లాలో గతేడాది 93.68 లక్షల చేప పిల్లల పంపిణీ
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రతి ఏడాది చెరువులు నిండగానే రాష్ట్ర ప్రభుత్వం మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు పంపిణీ చేస్తున్న చేపపిల్లల నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతేడాది చెరువుల్లో వదిలిన చేపపిల్లల సైజులో పెద్దగా వృద్ధి కనిపించకపోవడంతో మత్స్యకారులను ఆందోళనకు గురి చేస్తోంది. గత వర్షాకాలంలో చెరువులు నిండడం, ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యకారుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. తీరా.. చేపపిల్లల పంపిణీ సగానికి తగ్గించడం, ప్రైవేటు హేచరీలలో కొందామంటే అందుబాటులో లేకపోవడం వల్ల వారు నిరాశపడాల్సి వచ్చింది. చాలీచాలని చేపపిల్లలు చెరువుల్లో వదిలి ఉత్పత్తి కోసం ఎదురుచూసిన మత్స్యకారులకు మండుతున్న ఎండలతో నీరు పూర్తిగా అడుగంటిపోవడం, చేపల సైజు రాకపోవడం వల్ల వారి జీవనంపై ప్రభావాన్ని చూపింది. గతేడాది అక్టోబర్ నెలలో పంపిణీ చేసిన చేపపిల్లలు కనీసం అర కేజీ కూడా పెరగకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. టెండర్ల సమయంలో కొనుగోలు కమిటీ హేచరీలను సందర్శించి నాణ్యతపై సముఖత వ్యక్తం చేసిన తర్వాతే చేపపిల్లల పంపిణీకి టెండర్ ఫైనల్ చేస్తారు. ఆ సమయంలో నాణ్యతను పరిశీలించాల్సిన సంబంధిత శాఖ అధికారులు హడావుడిగా పంపిణీ చేయడం, వాటిలో కూడా సగం వరకు కోత విధించడం వల్ల మత్స్యకారులకు తీరని అన్యాయం జరిగింది.
● మహబూబ్‌నగర్ జిల్లాలో 234 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 12,496 మంది సభ్యులున్నారు. జిల్లావ్యాప్తంగా 1,091 చెరువులు, కుంటలు ఉండగా.. గత వర్షాకాలం సీజన్‌లో 993 చెరువుల్లో చేపపిల్లలను వదలాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 1.92 కోట్ల చేపపిల్లలు అవసరమవుతాయని అంచనా వేయగా.. సగానికి కుదించి పంపిణీ చేశారు.
పథకాల అమలులోనూ జాప్యం
మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయికి ఆశించిన స్థాయిలో చేరడం లేదు. ఎన్నో సంక్షేమ పథకాలున్నా అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. పథకాలపై అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే హడావుడి చేయడమే గానీ.. మిగతా సమయాల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారే విమర్శలున్నాయి.
చేప బక్క చిక్కింది..


