బావాజీ ఉత్సవాలకు సర్వం సిద్ధం
మద్దూరు/కొత్తపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం గురులోకామాసంద్ ప్రభు(బావాజీ)జయంతి (చైత్ర శుద్ధ పౌర్ణమి) ఉత్సవాలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. కొత్తపల్లి మండంలోని తిమ్మారెడ్డిపల్లిపల్లిలోని గురులోకామాసంద్ ప్రభు ఆలయంలో ఈనెల 11 నుంచి 14 వరకు చైత్ర శుద్ధ చతుర్ధశి నుంచి చైత్ర బహుళ విదియ వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు కర్ణాటక, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి గిరిజన భక్తులు పెద్దఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకోనున్నారు. మొదటి రోజు ప్రభోత్సవం, బంజారాల సంస్కృతి కార్యక్రమాలు, 12న రఽథోత్సవం, 13న మహాభోగ్, ప్రభువారి పల్లకీసేవ, కాళికాదేవి మొక్కుల చెల్లింపు, 14న కాళికాదేవి పల్లకీ సేవ, హోమం, పూర్ణాహుతి, మంగళహారతి తదితర క్రతువులు జరిపిస్తారు.
ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా అధికారులు
ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్‌కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించగా, గురువారం కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణకు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను నోడల్ అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. నోడల్ అధికారి పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు ఉత్సవాల ఏర్పాట్లు చురుగ్గా నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా తదితర ఏర్పాట్ల కోసం 450 మంది సిబ్బందిని నియమించినట్లు డీపీఓ కృష్ణ తెలిపారు. జాతరను 12 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్ ఇన్‌చార్జ్‌గా ఎంపీఓ వ్యవహరించనున్నారు. ఫిర్యాదులకు 2 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కోస్గి సీఐ సైదులు పేర్కొన్నారు. అదే విధంగా షీటీంలు, మఫ్టీలో పోలీసులు, పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇతర బందోబస్తుకు పోలీసులను నియమించినట్లు ఆయన తెలిపారు. నారాయణపేట డీఎస్సీ లింగయ్య పర్యవేక్షణలో 10 సీఐలు, 15 ఎస్‌ఐలు, 36 హెడ్‌కానిస్టేబుల్స్, 150 మంది పోలీసులు, 53 మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు. కోస్గి, మహబూబ్‌నగర్ డిపో నుంచి అదనంగా బస్సులు నడిపిస్తామని డిపో మేనేజర్ తెలిపారు.
నేటి నుంచి 14 వరకు ప్రత్యేక పూజాలు
6 రాష్ట్రాల నుంచి తరలిరానున్న గిరిజనులు
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా అధికారులు
బావాజీ ఉత్సవాలకు సర్వం సిద్ధం


