పారదర్శకంగా.. వేగవంతంగా
మెట్టుగడ్డ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలకు మరింత సులువుగా, వేగవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 19 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభించగా.. పైలెట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. అయితే ఈ నూతన విధానంపై ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడంతో మొదటిరోజు అంతంత మాత్రంగానే స్పందన లభించింది. మహబూబ్‌నగర్ కార్యాలయంలో స్లాట్ ద్వారా 74 దస్తావేజులు, వాక్ ఇన్ ద్వారా 10, నాగర్‌కర్నూల్‌లో స్లాట్ ద్వారా 8 దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి.
స్లాట్ సేవలు పరిశీలన..
మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభమైన స్లాట్ బుకింగ్ సేవలను జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్లాట్ ద్వారా జరుగుతున్న రిజి స్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. స్లాట్ బుక్ చేసుకుని సమయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వేగవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కార్యాలయంలోని సిబ్బందిని ఆదేశించారు. స్లాట్ బుకింగ్ సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సబ్ రిజిస్ట్రార్‌లకు సూచించారు. స్లాట్ బుకింగ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరుగుతున్నా ఆఫీసులో ఇష్టారాజ్యంగా దస్తావేజులేఖరుల దగ్గర పనిచేసేవారు, ప్రజలు గుమిగూడి ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్లాట్ బుకింగ్ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా రిజిస్ట్రార్ రవీందర్
సీన్ రివర్స్..
మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం సీన్ రివర్స్ అయ్యింది. సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండేది. కానీ, నూతన విధానం అమలులోకి రావడంతో.. స్లాట్ బుక్ చేసుకున్న దస్తావేజుల అమ్మకం, కొనుగోలుదారుల కోసం సుమారు గంట సేపు కార్యాలయ సిబ్బంది వేచిచూడటం గమనార్హం.
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను గురువారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రజలు పారదర్శకంగా, వేగంగా స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – రవీందర్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ అధికారి, మహబూబ్‌నగర్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభం
పైలెట్ ప్రాజెక్టు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో అమలు
మొదటిరోజు అంతంత మాత్రమే స్పందన
మహబూబ్‌నగర్‌లో ప్రక్రియను పరిశీలించిన జిల్లా అధికారి


