రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోళ్లు చేపట్టాలి
అడ్డాకుల: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. అడ్డాకుల మండలం పొన్నకల్‌లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లకు సరిపడే విధంగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. కొనుగోళ్లకు సరిపడే విధంగా పౌర సరఫరాల సంస్థ ద్వారా గన్నీ బ్యాగులను తెచ్చి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు జరిపిన వివరాలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని చెప్పారు. తేమ 17శాతానికి మించకుండా ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా అధికారులు రైతులను చైతన్యం చేయాలని సూచించారు. తగిన విధంగా తేమ శాతం ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకుంటే కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఇబ్బందులు తలెత్తవన్నారు. సన్న వడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు వివరించారు.
పెద్దవాగులో ఇసుక రీచ్ పరిశీలన
పొన్నకల్ శివారులోని పెద్దవాగును కలెక్టర్ విజయేందిర పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్థానిక ఇసుక రీచ్‌ల నుంచి మన ఇసుక వాహనం ద్వారా ఉచితంగా ఇసుక తరలించేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనిపై స్థానిక మండల అధికారులతో కలెక్టర్ మాట్లాడి తగిన సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఎం సుధీర్‌కుమార్ తదితరులు ఉన్నారు.


