పూలే ఆశయాలు కొనసాగిస్తాం
స్టేషన్ మహబూబ్‌నగర్: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక పద్మావతీకాలనీలోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర, అధికారులు, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంట్లో ఒక్క మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో వాళ్లందరూ విద్యావంతులు అవుతారని నమ్మిన వ్యక్తి పూలే అని అన్నారు. బ్రిటీష్ వారి కాలంలోనే చదువు అంటే ఎవరికి తెలియని సమయంలో మన పిల్లలు చదువుకోవాలని, ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసిన విద్యను అందించిన ఘనత ఆ మహనీయుడిదని అని కొనియాడారు. ఆయన ఆలోచనా విధానాన్ని అందిపుచ్చుకొని జిల్లాలో కలెక్టర్ సహకారంతో విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు అత్యుత్తమమైన విద్యను అందించే కార్యక్రమంతో ఇప్పుడు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను లర్నింగ్ సెంటర్‌గా మార్పు చేసి, మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించే జీఓ త్వరలో రాబోతుందన్నారు. దానికి అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ అని నామకరణ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ అంటరాని తనం నిర్మూలన, కులవివక్ష, మహిళ విద్యకు కృషి చేసిన మహానీయుడని అన్నారు. బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొంది గ్రూప్–1లో ఎంపికైన నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ను సన్మానం చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, నాయకులు వినోద్‌కుమార్, సంజీవ్ ముదిరాజ్, ఎన్‌పీ వెంకటేశ్, జహీర్ అక్తర్, చంద్రకుమార్‌గౌడ్, సిరాజ్‌ఖాద్రీ, బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


