‘మాస్టర్’పై శిక్షణకు 2 కళాశాలల ఎంపిక
● మహబూబ్‌నగర్, కొడంగల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోపైలట్ ప్రాజెక్టు అమలు
● వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
● తాజాగా జిల్లాలోని ప్రిన్సిపాళ్లతో సమావేశమైన వైఐఎస్‌యూ వీసీ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ‘మాస్టర్’పై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు ప్రభుత్వ డిగ్రీ–పీజీ కళాశాలలు ఎంపికయ్యాయి. వీటిలో మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ–పీజీ కళాశాల, కొడంగల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి ‘మాస్టర్’ (మహబూబ్‌నగర్ స్కిల్ ట్రెయినింగ్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ రెడీనెస్) ను పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నారు. ప్రతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చివరి సంవత్సరం చదివిన విద్యార్థులకు వృత్తిపరమైన, దైనందిన జీవితంలో అవసరమయ్యే అన్ని నైపుణ్యాలను నేర్పిస్తారు. ముఖ్యంగా విద్యార్థులను భవిష్యతులో అన్ని రంగాలలో రాణించేలా తీర్చిదిద్దనున్నారు.
అవగాహన కల్పించేందుకు ట్రైనర్లు
ఇందులో భాగంగా తాజాగా శనివారం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ) వైస్ చాన్స్‌లర్ వీఎస్‌వీఎస్‌ఎస్ సుబ్బారావు అధ్యక్షతన శనివారం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో స్థానిక ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ–పీజీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మాస్టర్’పై డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు గాను నిష్ణాతులైన ట్రైనర్లను పంపిస్తామన్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా హాజరు శాతాన్ని, అవగాహన సామర్థ్యాలను బేరీజు వేస్తూ వారిని రెండు తరగతులుగా విభజిస్తామన్నారు. మొదటిది ‘బేసిక్’లోగల విద్యార్థులకు కిందిస్థాయి నుంచి సాఫ్ట్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ వృద్ధి చేస్తారన్నారు. రెండో కేటగిరీ కింద ‘బేసిక్ ప్లస్’లో విద్యార్థులకు కోర్ సబ్జెక్టులలో లోతుగా అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైఐఎస్‌యూ రిజిస్ట్రార్ చమన్ మెహతా, విషయ నిపుణురాలు సౌమ్య నటరాజన్, ప్రొఫెసర్ జె.సుధాకర్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల డాక్టర్ బీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల (మహబూబ్‌నగర్), గద్వాల, కొడంగల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డా.కె.పద్మాతి, ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్, డా.జి.సుకన్య, డా.బి.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


