పిల్లలకు ఈత నేర్పేందుకు వెళ్లి తండ్రి మృతి
గోపాల్‌పేట: తన పిల్లలకు ఈత నేర్పేందుకు వెళ్లి ఓ తండ్రి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని బుద్దారం గ్రామంలో మధ్యాహ్నం చోటుచేసుకుంది. గోపాల్‌పేట ఏఎస్‌ఐ రాములు తెలిపిన వివరాలు.. బుద్దారం గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం(41) భార్య ఏర్పుల మంగమ్మతో కలిసి ఇద్దరు కుమారులకు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బుద్దారం పెద్దచెరువు వద్ద పెద్దతూము, నడింతూము మధ్య ప్రాంతంలో ఈత నేర్పేందుకు వెళ్లారు. మంగమ్మ ఇద్దరు పిల్లలకు నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ క్యాన్లు కడుతుండగా శ్రీశైలం ఒక్కసారిగా నీటిలోకి దూకాడు. అనంతరం బయటకు తేలలేదు. ఈ నేపథ్యంలో భార్యాపిల్లలు కేకలు వేయగా స్థానికులు నీటిలోకి దిగి వెతకగా, సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మృతదేహం బయటపడింది. బురదలో ఇరుక్కోవ డంతో శ్రీశైలం మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
ఎర్రవల్లి: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని మునగాల శివారులో చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్‌ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. గద్వాల పట్టణానికి చెందిన కళ్యాణ్ కుమార్ (27) బైక్‌పై శుక్రవారం రాత్రి తమ బంధువు వివాహం నిమిత్తం వల్లూరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని మునుగాల శివారులో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య సరోజతో పాటు కుమారుడు ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుత్ వైర్లు తగిలి డీసీఎం దగ్ధం
గట్టు: మండలంలోని లింగాపురం సమీపంలో శనివారం విద్యుత్ వైర్లు తగిలి డీసీఎం దగ్ధమైంది. స్థానికుల వివరాల మేరకు.. లింగాపురం గ్రామానికి చెందిన కుమ్మరి లింగన్న, పెద్దన్న పండించిన పొప్పాయి పండ్లను మార్కెట్‌కు తరలించేందుకు డీసీఎం వచ్చింది. అయితే పొప్పాయి తోట వద్ద డీసీఎంను వెనక్కి తీసుకుంటున్న క్రమంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న రైతులు డీసీఎం డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. డీసీఎంకు అంటుకున్న మంటలు డీజిల్ ట్యాంక్ వరకు వ్యాపించడంతో వాహనం మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. సమాచారం అందుకున్న అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఒకరిపై కేసు నమోదు
మహబూబ్‌నగర్ క్రైం: రెండు నెలల కరెంట్ బిల్లు కట్టలేదని.. మీటర్ కట్ చేసిన లైన్‌మన్‌ను అసభ్యపదజాలంతో దూషించిన వ్యక్తిపై కేసు నమోదైంది. టూటౌన్ ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి వివరాల మేరకు.. విద్యుత్‌శాఖ అసిస్టెంట్ లైన్‌మన్ శివకిషోర్ స్థానిక న్యూటౌన్‌లో ఉన్న మనోజ్ రియల్ ఎస్టేట్ ఆఫీస్‌కు సంబంధించిన రెండు నెలల కరెంట్ బిల్లు కట్టాలని యజమానికి సూచించారు. అయినప్పటికీ బిల్లు కట్టకపోవడంతో ఈ నెల 10న ఆఫీస్‌కు సంబంధించిన విద్యుత్ మీటర్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో ఆఫీస్ యజమాని మనోజ్‌కుమార్ 11న మధ్యాహ్నం లైన్‌మన్‌కు ఫోన్‌చేసి అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు అదే రోజు సాయంత్రం జెడ్పీ కార్యాలయానికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.


