చెరువులో పడి ఇద్దరి గల్లంతు
రాజాపూర్ (బాలానగర్): చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన సోమవారం బాలానగర్ మండలం మోతీఘనపూర్ పెద్దచెరువులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్ మండలం గంగాధర్‌పల్లికి చెందిన శివరాములు (45) గ్రామ శివారులోని పెద్ద చెరువులో పడిపోయాడు. గుర్తించిన యాదయ్య (25) శివరాములు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంలో వెంటనే అక్కడకు చేరుకున్నారు. తీసుకొస్తానంటూ యాదయ్య కూడా చెరువులోకి దిగగా.. ఈత రాకపోవడంతో ఆయన కూడా చెరువులో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న బాలానగర్ ఎస్‌ఐ లెనిన్‌గౌడ్ గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు ప్రారంభించినా.. రాత్రి వరకు ఆచూకీ లభించలేదు.
క్రికెట్ బెట్టింగ్ మాయ
జడ్చర్ల: బెట్టింగ్ యాప్‌లో పందాలు కాసిన ఓ విద్యార్థి చివరకు రూ. 1.05కోట్ల అప్పులపాలైన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు (ఇంజినీరింగ్ విద్యార్థి) ఓ యాప్‌లో క్రికెట్‌కు సంబంధించి బెట్టింగ్ కాశాడు. అయితే బెట్టింగ్ యాప్‌లో వచ్చిన లోన్ అప్లికేషన్‌ను పూర్తిచేసి.. ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా తదితర వివరాలను పొందుపరిచి, వారిచ్చిన నిబంధనలకు అంగీకారం తెలిపారు. దీంతో విద్యార్థి అనుకున్నంత లోన్ మంజూరు కావడం.. మంజూరైన డబ్బులతో బెట్టింగ్ కాయడం జరిగింది. తీరా బెట్టింగ్ పూర్తయ్యే సరికి సదరు విద్యార్థికి రూ. 1.05కోట్ల అప్పులు మిగిలాయి. ఈ అప్పునకు రూ.30 నుంచి రూ.40 వరకు వడ్డీగా ఉంది. తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో ఇటీవల వారు విద్యార్థి ఇంటికి వచ్చి నానాయాగి చేశారు. అయితే పరువు కలిగిన ఆ కుటుంబ సభ్యులు తమ కుల సంఘం నాయకుడి ద్వారా మధ్యవర్థిత్వం నెరిపి చివరకు సెటిల్‌మెంట్ చేసుకున్నారు. అప్పులవాళ్లు ఇచ్చిన రూ. 1.05 కోట్లను వడ్డీ లేకుండా చెల్లించే విధంగా ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిసింది. ఇలా.. పట్టణంలో బెట్టింగ్ యాప్‌ల వలలో పడి పలువురు యువకులు రూ. కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికై నా పోలీసులు స్పందించి సైబర్ నేరాలతో పాటు బెట్టింగ్ యాప్‌లపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రూ.1.05కోట్ల అప్పుల్లో
కూరుకుపోయిన విద్యార్థి


