ముమ్మరంగా సహాయక చర్యలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి సోమవారం నాటికి 52 రోజులు గడుస్తోంది. డి–1 ప్రదేశంలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా నిపుణుల సూచనలు, సలహాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరికరాలు వినియోగించి మట్టి తవ్వకాలు, టీబీఎం శకలాల తొలగింపు చేపడుతున్నారు. ఐదు ఎస్కవేటర్లు నిరంతరాయంగా మట్టి తవ్వతుండగా.. కన్వేయర్ బెల్టుపై సొరంగం నుంచి బయటకు తరలిస్తున్నారు. సిబ్బందికి ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ కొనసాగుతోంది. సొరంగంలో నిరంతరాయంగా ఉబికివస్తున్న నీటిని భారీ మోటార్ల సాయంతో బయటకు తరలిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 సంస్థల 560 మంది సిబ్బంది రాత్రింబవళ్లు గల్లంతైన ఆరుగురి ఆచూకీ గుర్తించేందుకు శ్రమిస్తున్నా.. ఇంతవరకు దొరకలేదు. షిఫ్ట్‌లలో 560 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ..
సొరంగం ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు చేపడుతున్నామని, సిబ్బందికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. సోమవారం ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఇన్‌లెట్ జేపీ కార్యాలయం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నట్లు తెలిపారు. సహాయక బృందాల భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బంది నిర్విరామంగా పని చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ సంజయ్‌కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎల్‌బీసీలో 52 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
నిపుణుల సూచన మేరకు డి–1 ప్రదేశంలో తవ్వకాలు
ముమ్మరంగా సహాయక చర్యలు


