కొడుకు చేసిన పనికి తండ్రి బలి | - | Sakshi
Sakshi News home page

కొడుకు చేసిన పనికి తండ్రి బలి

Apr 16 2025 11:16 AM | Updated on Apr 16 2025 11:18 AM

అచ్చంపేట రూరల్‌: కుమారుడి వివాహేతర సంబంధానికి ఓ తండ్రి బలయ్యాడు. ప్రత్యర్థులు వెంటాడి వేటాడి దారుణంగా హతమార్చారు. ప్రశాంతంగా ఉండే నల్లమల ప్రాంతం ఈ హత్యతో ఒక్కసారిగా ఉలికిపడింది. గ్రామస్తుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య (54) చిన్న కుమారుడు పరమేశ్‌ అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు సంతానం ఉన్న ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఆ మహిళను ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి సహజీవనం చేశారు. సదరు మహిళ భర్త, బంధువులు వారున్న ప్రాంతానికి వెళ్లి యువకుడిని చితకబాది.. మహిళను స్వగ్రామానికి తీసుకువచ్చారు. అయితే సదరు యువకుడు, అతడి కుటుంబసభ్యులపై మహిళ కుటుంబ సభ్యులు పగ పెంచుకున్నారు. ప్రతీకారం కోసం ఎదురుచూశారు. మంగళవారం వీరయ్య తన పెద్ద కుమారుడు వెంకటేశ్‌తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్‌పై వస్తున్న విషయాన్ని గుర్తించారు. హైదరాబాద్‌–అచ్చంపేట ప్రధాన రహదారిపై నడింపల్లి సమీపంలో బైక్‌పై కొందరు వెంబడించగా.. మరికొందరు కారుతో వీరయ్య బైక్‌ను ఢీకొట్టారు. అనంతరం వారి కళ్లల్లో కారం చల్లి సుత్తి, గొడ్డలితో వీరయ్యపై విరుచుకుపడ్డారు. మెడ భాగంపై గొడ్డలితో వేటు వేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్‌పై దాడికి యత్నించగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ప్రధాన రహదారిపై ఆందోళన..

వీరయ్య హత్య విషయం తెలుసుకున్న అతడి బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌– అచ్చంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. గతంలో వీరయ్య కుటుంబంపై దాడి జరిగిన విషయంపై అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని వీరయ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిందితులకు పోలీసుల సపోర్టు ఉందని ఆరోపిస్తూ.. ఘటనా స్థలానికి వచ్చిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి యత్నించారు. గమనించిన తోటి పోలీసులు ఆర్టీసీ బస్సులో అతడిని అచ్చంపేటకు పంపించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవీందర్‌ తెలిపారు.

భర్త, ఇద్దరు పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం

నెల రోజుల క్రితం ఏపీకి వెళ్లి సహజీవనం

కుమారుడిపై కోపంతో... తండ్రిని వెంటాడి వేటాడి హతమార్చిన ప్రత్యర్థులు

కొడుకు చేసిన పనికి తండ్రి బలి 1
1/1

కొడుకు చేసిన పనికి తండ్రి బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement