రైతన్న క‘న్నీటి’ వ్యథ
అమరచింత: జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలో యాసంగి వరిపంట సాగుచేసిన రైతులకు క‘న్నీటి’ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇన్నాళ్లు వారబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందించిన అధికారులు.. ఇటీవల జూరాల కాల్వలకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేయడంతో వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన పంట రైతుల కళ్లెదుటే ఎండిపోతోంది. కనీసం ఒక తడి అయినా సాగునీరు అందిస్తే కొంత మేరకై నా వరిపంట చేతికి అందుతుందని రైతన్నలు ఆందోళన బాట పట్టారు. తమకు సాగునీరు కావాలంటూ వారంరోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు జూరాల ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. చివరి దశలో ఉన్న పంటకు సాగునీరందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
● యాసంగి సీజన్‌లో జూరాల ఎడమ కాల్వ పరిధిలో రామన్‌పాడు వరకు 20వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ప్రాజెక్టు అదికారుల ప్రకటనతో ఉమ్మడి అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులు వరిపంట సాగుచేసుకున్నారు. ఆత్మకూర్ మండలంలోని డీ–6 కెనాల్ పరిధిలోని కాల్వ పూర్తిగా దెబ్బతినడంతో సాగునీరు దిగువన ఉన్న గ్రామాల రైతులకు సకాలంలో అందక పంటసాగు ఆలస్యమైంది. ప్రాజెక్టులో నీరు ఉండటం, వారబందీ పద్ధతిలో సాగునీరు వదులుతున్నారని గ్రహించిన రైతులు.. ఈసారి గట్టెక్కుతామని ఆశపడి వరిసాగు సాగుచేసుకున్నారు. ఎకరానికి రూ. 25వేల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులకు చివరి దశలో సాగునీరు అందక పోవడంతో వారి ఆశలన్నీ అడియాశలుగా మిగిలిపోయాయి. ఇప్పటికే జూరాల, గుంటిపల్లి, తూంపల్లి, ఆరేపల్లి, కత్తేపల్లె తదితర గ్రామాల్లో 3వేలకు పైగా ఎకరాల్లో వరిపైరు ఎండింది. తమకు కనీసం ఒక తడి అయినా సాగునీరు ఇవ్వాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులను విన్నవిస్తున్నారు.
పంట ఎండిపోతుంది..
యాసంగి పంట పూర్తి వరకు సాగునీరు వస్తుందని అప్పుచేసి పన్నెండు ఎకరాల్లో వరిసాగు చేశాను. వారబందీతో కాల్వకు సాగునీరు వదలడంతో పంట ఎండిపోయే స్థితికి చేరింది. ఇప్పుడు సాగునీటి విడుదలను పూర్తిగా నిలిపివేయడంతో పంట చేతికివచ్చే పరిస్థితి లేకుండాపోయింది. కనీసం ఒక్క తడైనా సాగునీరు ఇస్తే మూడెకరాల్లో అయినా పంట చేతికి వస్తుందనే ఆశ ఉంది. – వెంకటేశ్,
రైతు, మోట్లంపల్లి, ఆత్మకూర్ మండలం
ఎమ్మెల్యే చొరవ చూపాలి..
యాసంగిలో 12 ఎకరాల్లో వరిసాగు చేసుకున్నా. చివరి తడి వరకు సాగునీరు ఇస్తామని అధికారులు అన్నారు. ఇప్పుడేమో తాగటానికి నీరు లేదని రైతులకు ఇచ్చే నీటిని నిలిపివేశారు. దీంతో 12 ఎకరాల పంట పూర్తిగా దెబ్బతింటుంది. సాగునీటి విడుదలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చొరవ చూపాలి.
– వినోద్, రైతు,
ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం
జూరాల ఎడమ కాల్వకు సాగునీటిని నిలిపివేసిన అధికారులు
రైతుల కళ్లెదుటే ఎండిపోతున్న పంట
చివరి తడికై నా సాగునీరు ఇవ్వాలంటూ వేడుకోలు
రైతన్న క‘న్నీటి’ వ్యథ
రైతన్న క‘న్నీటి’ వ్యథ
రైతన్న క‘న్నీటి’ వ్యథ


